
ఆయుధాలు డిపాజిట్
జగిత్యాలక్రైం: స్థానిక సంస్థల ఎన్నికల్లో శాంతిభద్రతలపై పోలీసు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో కోడ్ అమలులోకి వచ్చిన విషయం తెల్సిందే. దీంతో వ్యక్తిగతంగా లైసెన్స్ ఆయుధాలు కలిగిన వారి నుంచి డిపాజిట్ చేసుకునేందుకు పోలీస్‌స్టేషన్ల వారీగా నోటీసులు జారీ అయ్యాయి. జిల్లాలో 30 మంది వద్ద లైసెన్స్‌డ్ తుపాకులు ఉన్నాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం లైసెన్స్‌డ్ తుపాకులను తెప్పించుకుని పోలీస్‌స్టేషన్లలో డిపాజిట్ చేయిస్తున్నారు. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, రియల్టర్లు ఆయుధాల కోసం లైసెన్స్ పొందారు. వీరితోపాటు ప్రైవేటు బ్యాంక్‌ల భద్రత కోసం ఆయుధాలకు లైసెన్స్ జారీ చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఆయుధాలు ఉన్నవారు బెదిరింపులకు పాల్పడే అవకాశం ఉండటంతో ఎన్నికలయ్యే వరకు పోలీసులు డిపాజిట్ చేసుకుంటారు. ఆయుధ లైసెన్స్ ఉన్నవారి వివరాలను నేషనల్ డేటా బేస్ ఆర్ట్స్ లైసెన్స్ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. లైసెన్స్ కలిగిన ప్రతి ఒక్కరికి ఐడీ నంబరు కేటాయించారు. ఇప్పటికే జిల్లాలో 30 మంది లైసెన్స్‌దారులకు నోటీసులు జారీ చేసి వారి నుంచి బుధవారం సాయంత్రం వరకు డిపాజిట్ చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఆయుధ లైసెన్స్ పొందాలంటే...
భద్రత కోసం వ్యాపారవేత్తలు, ఇతరులు ఆయుధ లైసెన్స్ పొందాలంటే పలు కారణాలు చూపించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే ప్రతి వ్యక్తికి ఇతరుల నుంచి ప్రాణహాని ఉంటేనే లైసెన్స్ ఇస్తారు. సంబంధిత వ్యక్తి సంఘ విద్రోహశక్తులు, మావోయిస్టులతో సంబంధం ఉండకూడదు. రాజకీయ నాయకులు ప్రత్యర్థి పార్టీ నుంచి ముప్పు ఉంటే లైసెన్స్ ఇస్తారు. పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లే వ్యాపారులు, రియల్టర్లు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఆస్తుల రక్షణ కోసం ఆయుధ లైసెన్స్ ఇస్తారు. లైసెన్స్‌లు కావాలంటే కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆయన రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారి పూర్తిస్థాయిలో విచారణ చేపడతారు. లైసెన్స్‌దారుడు మూడేళ్లకోసారి రెన్యూవల్ చేయించుకోవాలి. ఒక లైసెన్స్‌పై 3 ఆయుధాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆయుధాలను కొనుగోలు చేసి వాటి వివరాలను పోలీస్‌స్టేషన్‌లో అందించాల్సి ఉంటుంది. లైసెన్స్ కలిగిన వ్యక్తులపై ఏదైనా సందర్భాల్లో క్రిమినల్ కేసులు నమోదైతే వారి ఆయుధ లైసెన్స్ రద్దు చేస్తారు.
జిల్లాలో లైసెన్స్‌డ్ తుపాకులు 30
పోలీస్‌స్టేషన్‌లో డిపాజిట్ చేయాలని నోటీసులు
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నిర్ణయం