
హ్యాకర్ల చేతికి ఓదెల ఆధార్ కేంద్రం
పెద్దపల్లిరూరల్: ఆన్‌మోసాలు ఆగడంలేదు. సైబర్ నేరగాళ్లు, ఆన్‌లైన్ మోసగాళ్లు రోజుకో రూట్ మార్చుతూ ప్రజలకు ఎరవేస్తున్నారు. తాజాగా ఓదెల మండల కేంద్రంలోని మీసేవ ఆపరేటర్ తన ఆధార్ కేంద్రానికి సంబంధించి అప్‌డేట్ చేస్తామంటూ సైబర్ మోసగాళ్లు (సెల్ నంబరు 07427069687) నుంచి చేసిన ఫోన్‌కాల్‌కు స్పందించడంతో ఆధార్ సెంటర్‌ను హ్యాక్ చేశారు. కొద్ది నిమిషాల్లోనే ఆ ఐడీ ద్వారా నాలుగు ఆధార్‌కార్డులు డౌన్‌లోడ్ చేసినట్లు ఆపరేటర్‌కు సమాచారం రావడంతో అవాక్కయ్యాడు. ఆ వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లాడు. స్పందించిన అధికారులు యూఐడీఏఐ అధికారులను అప్రమత్తం చేశారు. వారు ఆధార్‌సెంటర్ హ్యాకర్ల చేతికి చిక్కినట్లు నిర్ధారించారు. ఇలాంటి ఘటన ఇదివరకు నాగర్‌కర్నూల్ జిల్లాలోనూ జరిగినట్లు సమాచారం. జిల్లాలోని పలు ఆధార్‌కేంద్రాల నిర్వాహకులకు సైతం ఇలాంటి ఫోన్‌కాల్స్ వచ్చినట్లు ఆపరేటర్లు తెలిపారు. కొంతకాలంగా ఓదెల మీసేవ కేంద్రంలో గల ఆధార్ సెంటర్ ద్వారా సేవలు నిలిపి వేశారు. కొద్ది రోజుల క్రితమే అధికారులు అనుమతినివ్వడంతో సేవలు పునరుద్ధరించారు. ఈ క్రమంలో హ్యాకర్ల నుంచి ఫోన్‌కాల్ రావడంతో ఆధార్ కేంద్రం అనుమతులిచ్చే కార్యాలయ అధికారుల నుంచే ఫోన్‌కాల్ వచ్చిందని భావించి ఎనీడెస్క్‌ను హ్యాకర్లకు అప్పగించి మోసపోయినట్లు తెలిసింది.
పీఈసీ కిట్లను అప్పగించొద్దు..
ఆధార్ కేంద్రాలను నిర్వహించే ఆపరేటర్లు అనధికారిక అపరిచిత వ్యక్తులు చేసే ఫోన్‌కాల్స్‌కు స్పందించొద్దని యూఐడీఏఐ అధికారులు బుధవారం రాష్ట్రంలోని ఆధార్ ఆపరేటర్లకు దిశానిర్దేశం చేశారు. ఆధార్‌కేంద్ర నిర్వాహకులు తమ సెంటర్లలో వినియోగించే కంప్యూటర్ నుంచి ఎనీడెస్క్, లేదా ఇతర రిమోట్‌యాక్సెస్ ఇచ్చి మోసపోతున్నారని, ఇది ఆధార్ డేటా భద్రతకు ముప్పు తెస్తుందని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎనీడెస్క్, టీంవ్యూయర్ ఇతర రిమోట్ యాక్సెస్ సమాచారాన్ని అనధికార వ్యక్తులతో పంచుకోవద్దని సూచించారు. యూఐడీఏఐ భద్రతా విధానాలకు అనుగుణంగా అవసరం లేని రిమోట్ యాక్సెస్ టూల్స్‌ని అన్‌ఇన్‌స్టాల్ చేయాలన్నారు.
అపరిచితుల ఫోన్‌కాల్స్‌కు స్పందిచొద్దు
యూఐడీఏఐ కార్యాలయ అధికారుల ఆదేశం