
‘అందాలభామలకు తులాలకొద్దీ బంగారమా..’
● ఇక్కడి ఆడబిడ్డలకు ఎందుకివ్వడం లేదు.. ● జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత
జగిత్యాలటౌన్: తెలంగాణ ఆడబిడ్డలకు ఇచ్చేందుకు తులం బంగారం లేదుగానీ.. సుందరీమణులకు మాత్రం 30 తులాల చొప్పున ఇస్తానని సీఎం ప్రకటించడమేంటని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత ప్రశ్నించారు. మహిళలతో కలిసి ఆదివారం విలేకరులతో మాట్లాడారు. సీఎంకు అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ ఆడబిడ్డలపై లేకపోవడం బాధాకరమన్నారు. ఎన్నికల సమయంలో తెలంగాణ ఆడబిడ్డలకు పెళ్లి కానుక కింద రూ.లక్షతోపాటు తులం బంగారం ఇస్తానని హామీ ఇచ్చి చేతులెత్తేశారని విమర్శించారు. రాష్ట్రం అప్పుల పాలయిందంటూనే అందాల పోటీలకు మాత్రం రూ.200కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ఓట్లు వేసి గెలిపించిన ఆడబిడ్డలను మోసం చేసిన రేవంత్‌రెడ్డి ఎవరి మెప్పు కోసం అందాల భామలకు ఒక్కొక్కరికి 30 తులాల బంగారం ఇస్తున్నారని నిలదీశారు.
సార్వత్రిక సమ్మె జూలై 9కి వాయిదా
కోరుట్ల: కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈనెల 20న నిర్వహించాల్సిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జూలై 9కి వాయిదా వేసినట్టు ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూసీ, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు సుతారి రాములు, చింతా భూమేశ్వర్, ఎండీ.చౌదరి తెలిపారు. ఈ మేరకు పట్టణంలోని సీ.ప్రభాకర్ భవన్‌లో ఆదివారంకార్మిక సంఘాల సమావేశం నిర్వహించారు. పహల్గాంలో 26 మందిని ఉగ్రవాదులు కాల్చిచంపిన తర్వాత దేశ రాజకీయ పరిణామాలు, సైనికుల పోరాట చర్యల కారణంగా సమ్మె వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్మిక సంఘాల నేతలు రామిల్ల రాంబాబు, దేశవేణి నర్సయ్య, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా శ్రీవేంకటేశ్వర స్వామి కల్యాణం
కథలాపూర్: మండల కేంద్రంలో శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహోత్సవాల్లో భాగంగా ఆదివారం వేంకటేశ్వర స్వామి కల్యాణం ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాలకు హాజరైన భక్తులకు నిర్వాహకులు అన్నదానం చేశారు. ఈ ఉత్సవాల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, వివిధ పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

‘అందాలభామలకు తులాలకొద్దీ బంగారమా..’