డీజిల్‌ కుంభకోణం | - | Sakshi
Sakshi News home page

డీజిల్‌ కుంభకోణం

May 6 2025 12:28 AM | Updated on May 6 2025 12:28 AM

డీజిల

డీజిల్‌ కుంభకోణం

● జగిత్యాల బల్దియాలో అవినీతి బాగోతం ● నెలలో రూ.ఐదు లక్షల వరకు పక్కదారి పట్టినట్లు ఆరోపణలు ● ప్రణాళిక లేకుండానే ఇంధనం పోయిస్తున్న అధికారులు

జగిత్యాల: రాజుల సొమ్ము రాళ్లపాలు అన్న చందంగా ప్రజల సొమ్ము ఇష్టానుసారంగా జగిత్యాల మున్సిపాలిటీలో దుర్వినియోగం అవుతోంది. ఈ బల్దియా అవినీతికి కేరాఫ్‌గా నిలుస్తోంది. తాజాగా పారిశుధ్య వాహనాలకు అవసరమయ్యే డీజిల్‌ వ్యవహారంలో సుమారు రూ.5 లక్షల వరకు అక్రమాలు చోటుచేసుకున్నట్లు తెలిసింది. ఒక ప్రణాళిక లేకుండా ఇష్టానుసారంగా డీజిల్‌ పోయిస్తూ అందినకాడికి దండుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలో మున్సిపల్‌ వాహనాలకు ప్రతివారం శానిటేషన్‌ కోసం డీజిల్‌ వినియోగిస్తారు. వారానికోసారి డీజిల్‌ పోయిస్తుంటారు. మున్సిపాలిటీలో మొత్తం 72 వాహనాలు ఉన్నాయి. ఇందులో వారానికి సుమారు 1800 నుంచి 2 వేల లీటర్ల వరకు డీజిల్‌ వినియోగం అవుతుంది. గతంలోనూ డీజిల్‌లో కుంభకోణం జరగడంతో అప్పటి కమిషనర్‌ కూపన్ల వ్యవస్థను తీసుకువచ్చారు. ఇప్పుడు అది పక్కన పెట్టారు. డీజిల్‌ బిల్లు ప్రతినెలా రూ.8 నుంచి రూ.10 లక్షల వరకు వస్తుండేది. తాజాగా అది రూ.16.21 లక్షలు రావడంతో కొందరు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టాలని కలెక్టర్‌ స్పెషల్‌ ఆఫీసర్‌, అడిషనల్‌ కలెక్టర్‌ను ఆదేశించడంతో మున్సిపల్‌ అధికారులను పూర్తిస్థాయిలో నివేదిక ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. డీజిల్‌ పోయించడంలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని, గతంలోనే ఎన్ని ఆరోపణలు వచ్చినా పట్టించుకోలేదు. ఇందులో ఎవరెవరి హస్తం ఉందో విచారణలో తెలియనుంది. శానిటేషన్‌ విభాగంలో పనిచేస్తున్న ఓ అధికారి డీజిల్‌కు సంబంధించిన వ్యవహారం చూస్తుండేవారు. ప్రస్తుతం అతన్ని ఆ శాఖ నుంచి తొలగించి వార్డు ఆఫీసర్‌కు అప్పగించారు. డీజిల్‌ పోయించడంలో బిల్లులు అదనంగా తీసుకుంటూ ఎక్కువ చూపారని ఆరోపణలు వస్తున్నాయి. గత నెల రూ.16.21 లక్షల బిల్లు రావడంతో అనుమానాలకు తావిస్తోంది.

వాహన నంబర్లు లేని రశీదులు.. మ్యానువల్‌ బిల్లులు

డీజిల్‌కు సంబంధించి మున్సిపల్‌ వాహనాలకు ఏ పెట్రోల్‌ బంక్‌లో పోయిస్తుంటారో వారు కంప్యూటర్‌ బిల్లు ఇస్తుంటారు. అందులో ఏ సమయంలో పోయించారు..? ఎప్పుడు పోయించారు..? వాహనం నంబరు కూడా ఉంటుంది. ఫిబ్రవరిలో మున్సిపల్‌లో పెట్టిన బిల్లుల్లో వాహనాల నంబర్లు లేకపోవడం, వెహికిల్‌ నంబర్లు ఎంటర్‌ చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. కొన్ని వెహికిల్‌ నంబర్లు కూడా తేడాగా ఉన్నట్లు తెలిసింది. పెట్రోల్‌ బంక్‌ వారు కంప్యూటర్‌ రిసీప్ట్‌ను ఎంత పోయించారు..? వెహికిల్‌ నంబరుతో సహా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడే మతలబు చోటుచేసుకుంది. వెహికిల్‌ నంబరు ఎంటర్‌ చేయకపోవడం, కంప్యూటర్‌ కాకుండా మ్యానువల్‌ బిల్లులు తీసుకున్నారు.

మ్యానువల్‌ బిల్లులు నిబంధనలకు విరుద్ధం

కంప్యూటర్‌ బిల్లులే తీసుకుని ఎంట్రీ చేయాల్సి ఉన్నప్పటికీ కొన్ని మ్యానువల్‌ బిల్లులు సైతం తీసుకున్న సందర్భాలున్నాయి. అక్రమాలకు పాల్పడేందుకే కంప్యూటర్‌ బిల్లులు రావడం లేదని, మ్యానువల్‌లో తీసుకుంటున్నారని ఆరోపణలు వచ్చాయి. మ్యానువల్‌ బిల్లుల్లో ఏ వాహనం ఎంత బిల్లు అన్నది ఇష్టానుసారంగా రాసుకునే అవకాశం సైతం ఉంది. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపితే అవినీతి బయటకు వచ్చే అవకాశాలున్నాయి.

కూపన్‌ వ్యవస్థకు మంగళం

పారిశుధ్య వాహనంలో ప్రతి వాహనానికి వారానికోసారి సుమారు 30 లీటర్ల డీజిల్‌ పోయిస్తుంటారు. గతంలో కమిషనర్‌ కూపన్‌ రాసి ఇచ్చేవారు. వాహనదారులు దానిని శానిటరి ఇన్‌స్పెక్టర్‌కు ఇస్తే ఆయన వాహనంలో డీజిల్‌ పోయిస్తారు. ఈ పద్ధతిన గతంలో ప్రతి నెల బిల్లు రూ.8 నుంచి రూ.10 లక్షల వరకు వచ్చేది. ప్రస్తుతం కూపన్‌ వ్యవస్థ ఎత్తివేసినట్లు తెలిసింది. దీంతో బిల్లులు గత కొద్ది నెలలుగా రూ.10 లక్షలు దాటడంతో అనుమానాలు రేకెత్తాయి.

విచారణకు ఆదేశం

డీజిల్‌ వినియోగానికి సంబంధించి సంబంధిత అధి కారికి మెమో జారీ చేశాం. రెండు రోజుల్లో వివరణ ఇవ్వాల్సి ఉంది. గతంలో ఏ వాహనానికి ఎంత డీజిల్‌ పోయించారు..? ఎంత ఖర్చు అయిందని పూర్తిస్థాయిలో నివేదిక ఇవ్వాలని కోరాం. రాగానే ఉన్నతాధికారులకు నివేదిస్తాం.

– స్పందన, మున్సిపల్‌ కమిషనర్‌

డీజిల్‌ కుంభకోణం1
1/3

డీజిల్‌ కుంభకోణం

డీజిల్‌ కుంభకోణం2
2/3

డీజిల్‌ కుంభకోణం

డీజిల్‌ కుంభకోణం3
3/3

డీజిల్‌ కుంభకోణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement