
దేశంలో కులగణన రాష్ట్ర ప్రభుత్వ విజయం
కథలాపూర్: దేశవ్యాప్తంగా జనాభా లెక్కలతో పాటు కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం రాష్ట్ర ప్రభుత్వ విజయమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం కథలాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో పాల్గొని మాట్లాడారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అనంతరం రైతువేదికలో 21 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. వ్యవసాయ శాఖ ఆధ్వరయంలో ఎస్సీ రైతులకు వందశాతం సబ్సిడీపై అందించే స్ప్రేయర్లను 62 మందికి అందజేశారు. రైతు వేదికలో జరిగిన కార్యక్రమంలో ప్రజలు ఎక్కువగా రావడంతో సరిపడా కుర్చీలు లేవని, మండు వేసవిలో తాగునీటి వసతి కల్పించకపోవడంతో అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి భాస్కర్, మా ర్కెట్ కమిటీ చైర్మన్ పూండ్ర నారాయణరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగరాజు, నాయకులు పులి హరిప్రసాద్, వాకిటి రాజారెడ్డి, ఎండీ హఫీజ్, కారపు గంగాధర్, గడ్డం చిన్నారెడ్డి, స్వామిరెడ్డి, తిరుపతిరెడ్డి, వంగ మహేశ్ పాల్గొన్నారు.
ప్యాడీ క్లీనర్లను
అందుబాటులో ఉంచాలి
సారంగాపూర్: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం శుభ్రం చేయడానికి రైతులకు ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉంచాలని డీఆర్‌డీవో రఘువరన్ అన్నారు. మండలంలోని లచ్చనాయక్‌తండా, రేచపల్లి , కోనాపూర్, లక్ష్మీదేవిపల్లి, పోతారం, బట్టపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలిచ్చారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఉదయం, సాయంత్రం తూకం వేసేలా చూడాలని సూచించారు. లచ్చనాయక్‌తండా కేంద్రంలో హమాలీల కొరత ఉండడంతో అప్పటికప్పుడు 11 మంది హమాలీలను తెప్పించి తూకం ప్రారంభించారు.