వైట్‌హౌస్‌ సమీపంలో మరోసారి కాల్పుల కలకలం | US Secret Service Shoots Armed Suspect Near White House | Sakshi
Sakshi News home page

వైట్‌హౌస్‌ సమీపంలో మరోసారి కాల్పుల కలకలం

May 5 2026 9:26 AM | Updated on May 5 2026 9:50 AM

US Secret Service Shoots Armed Suspect Near White House

వాషింగ్టన్: వైట్‌హౌస్‌ సమీపంలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. వాషింగ్టన్‌ మాన్యూమెంట్‌ సమీపంలో తుపాకీతో అనుమానాస్పద వ్యక్తి హల్‌చల్‌ చేశాడు. సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లను చూసిన నిందితుడు కాల్పులు జరిపాడు. ఎదురు కాల్పుల్లో అనుమానితుడు తీవ్రంగా గాయపడ్డాడు. కాల్పుల ఘటనలో ఓ బాలుడు కూడా గాయపడ్డాడు.

తుపాకీ కాల్పులు జరగడానికి కొద్ది నిమిషాల ముందు.. వైట్ హౌస్ కాంప్లెక్స్ వెలుపల గస్తీ తిరుగుతున్న సీక్రెట్ సర్వీస్ అధికారులు,ఏజెంట్లు తుపాకీని కలిగి ఉన్నట్లు కనిపిస్తున్న ఒక అనుమానిత వ్యక్తిని గుర్తించారని యూఎస్‌ఎస్‌ఎస్ డిప్యూటీ డైరెక్టర్ మాట్ క్విన్ మీడియా సమావేశంలో చెప్పారు. యూనిఫాంలో ఉన్న సీక్రెట్ సర్వీస్ పోలీసులు ఆ వ్యక్తిని సమీపించగా.. అతను పారిపోతూ అధికారులపై కాల్పులు జరిపారని క్విన్ తెలిపారు. అధికారులు ఎదురుకాల్పులు జరపడంతో ఆ వ్యక్తికి బుల్లెట్ గాయాలయ్యాయి.

సదరు వ్యక్తి అంతకుముందు సోమవారం వైట్ హౌస్ ప్రవేశ ద్వారం వద్దకు చేరుకోవడానికి ప్రయత్నించారా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక  సమాచారం ప్రకారం నిందితుడు మేరీల్యాండ్‌కు చెందిన శ్వేత జాతీయుడిగా భావిస్తున్నారు. ప్రస్తుతం స్థానిక ఆసుపత్రిలో అతనికి చికిత్స అందిస్తున్నారు. 

కాగా, నిందితుడు జరిపిన కాల్పుల్లో గాయపడిన ఓ బాలుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం లేదని.. స్వల్ప గాయంతో బయటపడ్డారని డీసీ పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో సీక్రెట్ సర్వీస్ సిబ్బంది ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. కాల్పుల ఘటన జరగడానికి కొద్దిసేపటి ముందే.. వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కాన్వాయ్ ఆ ప్రాంతం మీదగా వెళ్ళింది.

కాల్పుల ఘటన జరిగిన కొద్దిసేపటికే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్‌లోని ఈస్ట్ రూమ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగించారు. అధ్యక్షుడు ట్రంప్‌కు ఎలాంటి ముప్పు లేదని.. ఈ ఘటనకు వైట్ హౌస్‌తో సంబంధం ఉన్నట్లు ప్రస్తుతం ఎలాంటి ఆధారాలు లేవని క్విన్ ఒక ప్రకటనలో తెలిపారు. వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్ జరిగిన హోటల్ వద్ద కాల్పుల ఘటన జరిగిన రెండు వారాల లోపే ఈ రెండో ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement