అవగాహనను ప్రజలకే వదిలేశామంటూ పెంటగాన్ వ్యాఖ్య
వాషింగ్టన్: గ్రహాంతర జీవులు, గుర్తు తెలియని ఎగిరే వస్తువు (యూఎఫ్‌వో)లకు సంబంధించిన ఫైళ్లను అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ బహిర్గతం చేసింది. వీటిపై ప్రజలు ఎవరికి వారు సొంత అవగాహన ఏర్పర్చుకోవచ్చని శుక్రవారం ఎక్స్‌లో తెలిపింది. పెంటగాన్‌తోపాటు వైట్ హౌస్, నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్, ఇంధన శాఖ, నాసా, ఎఫ్‌బీఐలు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి.
గత ప్రభుత్వాలు ఈ సమాచారాన్ని తక్కువ చేసి చూపడానికి, వారిని నిరుత్సాహ పర్చడానికి ప్రయత్నించాయన్న పెంటగాన్.. అధ్యక్షుడు ట్రంప్ మాత్రం గరిష్ట పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొంది. యూఎఫ్‌వోల ఫైళ్లను క్రమపద్ధతిలో విడుదల చేస్తామని తెలిపింది. ఈ ఫైళ్లను బహిర్గతం చేస్తామంటూ ట్రంప్ ఫిబ్రవరి నుంచి చెబుతూ వస్తున్నారు.
ఇప్పటికే ఆయన కెన్నెడీ సోదరులు అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ, సెనేటర్ రాబర్ట్ ఎఫ్ కెన్నడీలతోపాటు, మార్టీన్ లూథర్ కింగ్ జూనియర్ హత్యలకు సంబంధించిన రికార్డులను విడుదల చేశారు. అయితే, ఇందులో అప్పటికే తెలిసిన విషయాలకు మించి మరేమీ కొత్తగా వెల్లడి కాలేదు. యూఎఫ్‌వోలకు సంబంధించిన పత్రాలను బయట పెట్టాలని పెంటగాన్ ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తోంది. సైనిక సిబ్బంది తాము చూసిన వింత ఎగిరే వస్తువుల గురించిన సమాచారాన్ని పంచుకోవడంతో దశాబ్దాల నాటి ఫైళ్లను విడుదల చేయాలని అమెరికా కాంగ్రెస్ 2022లో పెంటగాన్‌ను ఆదేశించింది.
ఇందుకోసం ప్రత్యేకంగా ఒక కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఈ కార్యాలయం 2024లో విడుదల చేసిన మొట్టమొదటి నివేదికలో..గుర్తు తెలియని దృగి్వషయాలకు సంబంధించిన ఘటనలు వందలాదిగా నమోదయ్యాయని తెలిపింది. గ్రహాంతర జీవుల సాంకేతికతను అమెరికా ప్రభుత్వం గుర్తించినట్లు మాత్రం ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని స్పష్టం చేసింది. కాగా, సైనిక సాంకేతికతపై అవగాహన లేని వారు తాజాగా వెల్లడి చేసిన వీడియోల విషయంలో పొరపాటుపడే అవకాశం ఉందని, తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


