కరోనా: ట్రంప్‌నకు మరో దెబ్బ

Trump campaign manager tests positive for Covid-19 - Sakshi

ఒకవైపు సమీపిస్తున్న ఎన్నికలు, మరోవైపు  కరోనా ప్రకంపనలు

 ప్రచార కార్యక్రమాలపై మహమ్మారి దెబ్బ

వాషింగ్టన్ : మరో నెల రోజుల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న తరుణంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు కరోనా మహమ్మారి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రెండవ సారి కూడా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించాలనే ప్రయత్నాలపై మరో దెబ్బ పడింది. ఇప్పటికే  ట్రంప్, ఆయన భార్య మెలానియాకు కూడా కరోనా సోకింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా ట్రంప్ మిలిటరీ ఆసుపత్రిలో చేరడంతో  రిపబ్లికన్ పార్టీ ప్రచార కార్యక్రమాలపై  ఆందోళన నెలకొంది. తాజాగా  ప్రచార నిర్వాహకుడు బిల్ స్టెపియన్ (42) కు కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇప్పటికే  ట్రంప్ ప్రధాన సలహాదారు హోప్ హిక్స్ కరోనా సోకడంతో  ప్రచారంలో ఉన్న సీనియర్ సభ్యులంతా పరీక్షలు చేయించుకుంటున్నారు.  ఈ క్రమంలో స్వల్ప జ్వరంతో బాధపడుతున్న బిల్ కు కరోనా సోకినట్టు తేలిందని అధికారులు ప్రకటించారు.

 

తాజా పరిణామంతో స్టెపియన్ రిమోట్‌గా ప్రచార బాధ్యతలను కొనసాగిస్తారని డిప్యూటీ క్యాంపెయిన్ మేనేజర్ జస్టిన్ క్లార్క్  ప్రధాన  బాధ్యతలను పర్యవేక్షిస్తారని భావిస్తున్నారు. అంతేకాదు రిపబ్లికన్ నేషనల్ కమిటీ అధ్యక్షురాలు రోనా మక్ డేనియల్  కరోనా నిర్ధారణ అయింది. దీంతో అధ్యక్షుడి రాజకీయ యంత్రాంగంలో ఇద్దరు ప్రధాన వ్యక్తులు  ప్రత్యక్ష ప్రచారంనుంచి  తాత్కాలికంగా తప్పుకున్నట్టే.  ట్రంప్‌కు మాజీ కౌన్సిలర్ అయిన కెల్లియాన్ కాన్వే , ఉత్తర కరోలినా రిపబ్లికన్ సెనేటర్ థామ్ టిల్లిస్ కూడా కరోనా సోకింది. మరోవైపు అధ్యక్ష పదవి బరిలో ఉన్  మాజీ వైస్ ప్రెసిడెంట్ జో బైడెన్‌,  ఉపాధ్యక్ష పదవికి పోటీ పడుతున్న హ్యారిస్ మాత్రం అటు  ఓపీనియన్ పోల్స్ లో ఇటు  ప్రచారంలో  దూసుకుపోతున్నారు.  కాగా ట్రంప్ మేరీల్యాండ్‌లోని బెథెస్డాలోని సైనిక ఆసుపత్రి వాల్టర్ రీడ్ మెడికల్ ఆసుపత్రిలో చేరిన తర్వాత తాను బాగానే ఉన్నానంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. రెమెడెసివిర్‌తో పాటు, కాక్టెయిల్, రెజెనెరాన్ లాంటి ప్రయోగాత్మక  మందుల ద్వారా ఆయనకు  చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top