Sri Lanka Crisis: భగ్గుమన్న పెట్రోలు, లీటరు రూ.420

Sri Lanka Crisis: Petrol reaches all time high of Rs 420 per litre - Sakshi

న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో  మరోసారి ఇంధన ధరలు భగ్గుమన్నాయి. మంగళవారం పెట్రోల్ ధరను 24.3 శాతం, డీజిల్ ధరను 38.4 శాతం పెంచుతూ అక్కడి సర్కారు నిర్ణయం తీసుకుంది.  దీంతో  ఆక్టేన్ 92 పెట్రోల్ ధర 420 రూపాయలు (1.17 డాలర్లు,) డీజిల్ రూ. 400 (1.11 డాలర్లు) కు చేరింది. ఏప్రిల్ 19 నుండి రెండోసారి ధరల పెంపుతో ఫ్యూయల్‌ ధరలు ఆల్ టైమ్ గరిష్టానికి చేరాయి. తీవ్రమైన ఆర్థిక, రాజకీయ సంక్షోభం నేపథ్యంలో విదేశీమారక నిల్వలు భారీగా క్షీణించాయి.  దీంతో  ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరాయి.

సవరించిన ధరలు మంగళవారం ఉదయం నుంచే అమల్లోకి వచ్చాయని ప్రభుత్వరంగ సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రకటించింది. శ్రీలంకలో చమురు నిల్వలు అడుగంటిపోవడంతో అక్కడి వినియోగదారుల ఇక్కట్లు అన్నీఇన్నీ కావు. 1948లో  స్వాతంత్య్రం పొందినప్పటి నుండి ఇంతటి సంక్షోభం ముందెన్నడూ లేదు. దాదాపు అన్ని నిత్యావసరాలకు తీవ్ర కొరత ఏర్పడింది. విదేశీ నిల్వల కొరత కారణంగా ఇంధనం, వంటగ్యాస్, ఇతర నిత్యావసరాలకోసం జనుల క్యూలైన్లలో బారులు తీరుతున్న పరిస్థితి. అయితే తీవ్ర ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం రేటు 40 శాతం దిశగా దూసుకుపోవడం, ఆహారం, ఇంధనం, ఔషధాల కొరతతో దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి.  

శ్రీలంక తీవ్రమైన విదేశీ మారక ద్రవ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నందున, ఇంధనం అడుగంటిపోకుండా నిరోధించే చర్యలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ఖర్చులను తగ్గించే చర్యగా,  ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావొద్దని,  ఆయా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలను నిర్దేశించింది. రవాణా, ఇతర సేవా ఛార్జీల సవరణకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపిందనీ ఈ ఫార్ములా ప్రతి పదిహేను రోజులకోసారి లేదా నెలకోసారి వర్తింపజేస్తామని విద్యుత్,ఇంధన శాఖ మంత్రి కాంచన విజే శేఖర ట్విటర్‌లో తెలిపారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top