వందలాదిగా డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించిన రష్యా
18 మంది మృతి, 118 మందికి గాయాలు
కీవ్: రష్యా మరోసారి ఉక్రెయిన్‌లోని జనావాసాలే లక్ష్యంగా భారీ దాడులకు తెగబడింది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు వందలాదిగా డ్రోన్లు, పదుల సంఖ్యలో క్షిపణులతో విధ్వంసం సృష్టించింది. అయితే, రష్యా ప్రయోగించిన 703 డ్రోన్లకు గాను 667 డ్రోన్లను అడ్డుకున్నామని ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. కనీసం 20 డ్రోన్లు, 12 క్షిపణులు మొత్తం 26 ప్రాంతాల్లో తీవ్ర నష్టం కలిగించాయంది.
ఈ దాడుల్లో చిన్నారి సహా 18 మంది చనిపోగా, 118 మంది క్షతగాత్రుల య్యారు. ఈ ఏడాదిలో రష్యా చేపట్టిన అతిపెద్ద దాడుల్లో ఇదొకటని చెబుతున్నారు. రాజధాని కీవ్‌తోపాటు ఖరీ్కవ్, నీప్రో, ఒడెసా, జపొరిఝియా నగరాల్లో తీవ్ర నష్టం సంభవించింది. కీవ్‌లో 12 ఏళ్ల బాలుడు సహా నలుగురు చనిపోగా, 50 మందికి పైగా గాయాలపాలయ్యారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
రాజధానిలో 17 అపార్టుమెంట్ భవనాలు, 10 వరకు ప్రైవేట్‌నివాసాలతోపాటు గ్యాస్ స్టేషన్, షాపింగ్ మాల్, హోటల్, ఒక కార్యాలయం భవనం తీవ్రంగా దెబ్బతిన్నాయి. అనేక ప్రాంతాల్లో మంటలు చెలరేగాయి. తీరప్రాంత నగరం ఒడెసాలోని ఓ అపార్టుమెంట్ భవనంపై జరిగిన డ్రోన్, బాలిస్టిక్ మిస్సైల్ దాడుల్లో 9 మంది చనిపోయారు. పెద్ద ఎత్తున చెలరేగిన మంటలను అగ్ని మాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారు. హయ్యర్ ఎడ్యుకేషన్ మ్యూజిక్ అకాడమీ భవనంపై జరిగిన దాడిలో ఐదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. పౌరులే లక్ష్యంగా రష్యా బాలిస్టిక్, క్రూ యిజ్ క్షిపణులను ప్రయోగించిందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి అండ్రీ సిబిహా పేర్కొన్నారు.


