Pakistan Ex-PM Imran Khan Was Arrested In Qadir Trust Case - Sakshi
Sakshi News home page

సినిమా రేంజ్‌లో ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్ట్‌.. కారణం ఇదే..

Published Tue, May 9 2023 7:36 PM

Pakistan Ex PM Imran Khan Was Arrested In Qadir Trust Case - Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ అరెస్ట్‌ అయిన విషయం తెలిసిందే. కాగా, రెండు కేసుల్లో బెయిల్‌ విషయమై మంగళవారం ఇ‍మ్రాన్‌ఖాన్‌ ఇస్లామాబాద్‌ హైకోర్టుకు వెళ్లారు. ఈ సందర్భంగా పాక్‌ ఆర్మీ నాటకీయ పరిణామాల మధ్య ఇమ్రాన్‌ను అదుపులోకి తీసుకుంది. ఈ క్రమంలో ఇమ్రాన్‌ తరఫు లాయర్‌ తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. అయితే, ఇ‍మ్రాన్‌ఖాన్‌ ఎందుకు అరెస్ట్‌ అయ్యారంటే.. 

వివరాల ప్రకారం.. అల్ ఖాదిర్ యూనివ‌ర్సిటీకి భూమి కేటాయించిన సమయంలో పాక్‌ ప్రధానిగా ఇమ్రాన్‌ ఉన్నారు. ఆ వ‌ర్సిటీకి ఇమ్రాన్ ఖాన్ చైర్మన్‌గా కూడా ఉన్నారు. అయితే, భూ కేటాయింపుల విషయంలో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీంతో, ఈ అంశంపై కేసు నమోదు అయ్యింది. నేష‌న‌ల్ అకౌంట‌బులిటీ బ్యూరో ఈ కేసును విచారిస్తున్నది. ఈ కేసులో జ‌న‌వ‌రి 2021 నుంచి డిసెంబ‌ర్ 2021 వ‌ర‌కు వ‌ర్సిటీ ట్ర‌స్టుకు సుమారు 180 మిలియ‌న్ల పాక్ క‌రెన్సీ డొనేష‌న్ రూపంలో వ‌చ్చిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇమ్రాన్ వ‌ల్ల జాతీయ ఖ‌జానాకు రూ.50 బిలియ‌న్ల న‌ష్టం జ‌రిగిన‌ట్లు ప్రస్తుత మంత్రి రాణా స‌నావుల్లా ఆరోపించారు.

ఇక, ఈ కేసులో మంత్రులు జుల్‌ఫిక‌ర్ బుకారీ, మాజీ అడ్వైజ‌ర్ షెహ‌జాద్ అక్బ‌ర్‌లు కూడా ఉన్నారు. బ్రిట‌న్‌లో సీజ్ చేసిన 50 బిలియ‌న్ల అమౌంట్‌ను పాకిస్తాన్‌లో అంద‌జేసే అంశంపై రియాజ్‌తో ఒప్పందం కుదురింది. ఆ ఒప్పందం ప్ర‌కారం అల్ ఖాదిర్ వ‌ర్సిటీ ట్ర‌స్టుకు భూముల్ని అప్ప‌గించిన‌ట్లు తెలుస్తోంది. తొలుత భూమిని బుకారీ పేరిట ట్రాన్స్‌ఫ‌ర్ చేసి, ఆ త‌ర్వాత ఆ భూమిని ట్ర‌స్టుకు బ‌దిలీ చేశారు.

వ‌ర్సిటీకి భూమి అప్ప‌గించిన కేసులో గ‌తంలో టైకూన్ మాలిక్ రియాజ్‌కు ఎన్ఏబీ నోటీసులు జారీ చేసింది. ఒప్పందం ప్ర‌కారం సుమారు 57 ఎక‌రాల భూమిని అల్ ఖాదిర్ ట్ర‌స్టుకు డొనేట్ చేశారు. అల్ ఖాదిర్ వ‌ర్సిటీ త‌ర‌పున బుష్రా ఖాన్‌, డోనార్ మ‌ధ్య ఒప్పందం జ‌రిగింది. అయితే ఇమ్రాన్ ప్ర‌ధానిగా ఉన్న స‌మ‌యంలోనే ఈ ఒప్పందం జ‌ర‌గ‌డంతో దాంట్లో దాగిన అవినీతి బ‌య‌ట‌ప‌డింది. ఈ కేసులో రియ‌ల్ ఎస్టేట్ టైకూన్ మాలిక్ రియాజ్ వాంగ్మూలాన్ని గ‌తంలో తీసుకున్నారు. కాగా, ఈ రెండు కేసుల్లో బెయిల్ ద‌ర‌ఖాస్తు చేసుకున్న మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ ఇవాళ ఇస్లామాబాద్ హైకోర్టుకు వెళ్లారు. అయితే బ‌యోమెట్రిక్స్ వివ‌రాలు స‌మ‌ర్పిస్తున్న‌ స‌మ‌యంలో ఇమ్రాన్‌ను అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు.. ఇమ్రాన్‌ అరెస్ట్‌ నేపథ్యంలో పీటీఐ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు నిరసనలకు దిగారు. పలు చోట్ల కార్యకర్తలు రెచ్చిపోయారు. వాహనాలకు నిప్పటించారు. పాక్‌ ఆర్మీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆస్తులను ధ్వంసం చేశారు. ఇమ్రాన్‌ వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 

ఇది కూడా చదవండి: పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్ట్‌

Advertisement
Advertisement