
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో డెమొక్రటిక్ పార్టీ తరఫున వైస్ ప్రెసిడెంట్ రేసులో నిలిచిన కమలా హారిస్(55) భారత మూలాలకు సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. తమిళనాడుకు చెందిన పీవీ గోపాలన్ మనుమరాలైన కమల అగ్రరాజ్యంలో ఇప్పటికే పలు కీలక బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉపాధ్య పదవికి పోటీ పడుతున్న తొలి నల్లజాతి మహిళగా ఇటీవలే ఆమె మరో సరికొత్త చరిత్ర సృష్టించారు. ఈ నేపథ్యంలో జమైకా మూలాలతో పాటు భారత్‌తో కమలకు ఉన్న బంధం, భారత సంస్కృతీ సంప్రదాయాల పట్ల ఆమెకున్న విశ్వాసం గురించి వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. 2010 కాలిఫోర్నియా అటార్నీ ఎన్నికల సమయంలో తన గెలుపును ఆకాంక్షిస్తూ, కొబ్బరికాయలు కొట్టాల్సిందిగా కమల తన చిన్నమ్మ సరళా గోపాలన్‌ను అడిగినట్లు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. కమల వ్యక్తిత్వాన్ని మలచడంలో ఆమె భారతీయ కుటుంబం కీలక పాత్ర పోషించిందంటూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. (కమల మీడియా కార్యదర్శిగా ఇండో అమెరికన్)
కాగా కమలా హారిస్ తల్లి శ్యామలా గోపాలన్ చెన్నైకి చెందిన వారన్న సంగతి తెలిసిందే. వైద్య విద్య కోసం అమెరికా వెళ్లిన ఆమె అక్కడే జమైకాకు చెందిన డేవిడ్ హారిస్‌ను ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు కమలా హారిస్, మాయా హారిస్ ఉన్నారు. అయితే కమలకు ఏడేళ్ల వయస్సు ఉన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోగా.. పిల్లల బాధ్యతను తల్లి శ్యామల స్వీకరించారు. తమిళనాడు సంప్రదాయ కుటుంబానికి చెందిన శ్యామల భారత్‌కు వచ్చినప్పుడల్లా పిల్లల్ని వెంట తీసుకువచ్చేవారు. అలా కమలకు చెన్నైతో అనుబంధం ఏర్పడింది. తన తాతయ్య గోపాలన్‌తో కలిసి ఆమె బీసెంట్ నగర్ బీచ్‌లో సేద తీరుతూ వాకింగ్ చేసేవారు.
ఆ సమయంలో హిందుత్వానికి సంబంధించిన పలు విషయాలు అడిగి తెలుసుకునేవారు. అలా భారతీయ సంప్రదాయాల పట్ల ఆమెకు నమ్మకం కుదిరింది. ఈ క్రమంలో తను అటార్నీ జనరల్‌గా పోటీ పడిన సమయంలో చెన్నైలో ఉండే చిన్నమ్మ సరళా గోపాలన్‌ను 108 కొబ్బరికాయలు కొట్టమని చెప్పారు. ఈ విషయాల గురించి 2018 నాటి ప్రసంగంలో కమల చెప్పుకొచ్చారు. తన తాతయ్య ఎన్నో కథలు చెప్పేవారని, ప్రజాస్వామ్య విలువల గురించి బోధించేవారని పేర్కొన్నారు. ఈరోజు తాను ఇలా ఉన్నానంటే అందుకు తాతయ్య మాటలే కారణమంటూ ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు.
ఇక ఈ కమల జో బిడెన్ రన్నింగ్ మేట్‌గా ఎంపిక కావడం తమకు సంతోషంగా ఉందంటూ కమల చిన్నమ్మ సరళా గోపాలన్ సంతోషం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కమల దయకలిగిన వ్యక్తి అని, తమ పట్ల ఆప్యాయత చూపించేదని, ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించి తమకు సాయం చేస్తుందని గుర్తుచేసుకున్నారు. ఇక గోపాలన్ ఇరుగుపొరుగు కూడా కమల కుటుంబంతో తమకు ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతూ.. ‘‘కమల ఉన్నత శిఖరాలకు ఎదుగుతుందని ముందే ఊహించాం. ఎందుకంటే ఆ కుటుంబంలోని ప్రతీ మహిళ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించకున్నారు’’అని చెప్పుకొచ్చారు.