Google Doodle: ఐసీసీ ప్రపంచ కప్‌ టోర్నీ, ఆడవాళ్లు మీకు జోహార్లు అంటున్న గూగుల్‌

Google Doodle: ICC Women Cricket World Cup 2022 - Sakshi

వివక్ష.. ఇది కనిపించని రంగమంటూ లేదు. అయితే ఈ పరిస్థితిని మార్చే ప్రయత్నాలు మాత్రం జరుగు... తూనే ఉన్నాయి. ఈ తరుణంలో మహిళల క్రికెట్‌కు ఆదరణ గతకొంతకాలంగా పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే.  తాజాగా ఐసీసీ మహిళల ప్రపంచ కప్‌ పోటీలు మొదలుకాగా..  ఈ టోర్నీకి మద్ధతుగా గూగుల్‌ డూడుల్‌తో ప్లేయర్‌లకు  జోహార్లు చెప్పింది. 

12వ ఎడిషన్‌ మహిళా క్రికెట్‌ ప్రపంచ కప్‌ పోటీలు మార్చి 4న ప్రారంభం అయ్యాయి. ఏప్రిల్‌ 3వ తేదీ దాకా జరగబోయే ఈ టోర్నీ కోసం గూగుల్‌ డూడుల్‌ను రిలీజ్‌ చేసింది. ఆరుగురు ప్లేయర్లు ప్రేక్షకుల మధ్య గేమ్‌లో మునిగిపోయినట్లు ఉండే డూడుల్‌ ఇది. గూగుల్‌ హోం పేజీలో ఈ డూడుల్‌ను మీరూ గమనించొచ్చు. క్లిక్‌ చేయగానే స్కోర్‌ బోర్డుకు వెళ్లడంతో పాటు బాల్స్‌ ఎడమ నుంచి కుడికి దూసుకెళ్లడం చూడొచ్చు. 

ప్రపంచంలో తొలి ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ 1844లో కెనడా, అమెరికా మధ్య జరిగింది. అయితే మహిళల ప్రపంచ కప్‌ మాత్రం 1973 నుంచి  మొదలైంది. కొవిడ్‌ కారణంగా కిందటి ఏడాది జరగాల్సిన టోర్నీ.. ఈ ఏడాదికి వాయిదా పడింది. న్యూజిలాండ్‌ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు తలపడుతున్నాయి.

తొలి మ్యాచ్‌ శుక్రవారం ఆతిథ్య న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌ మధ్య మొదలైంది. విండీస్‌ 259 పరుగులు సాధించగా.. 260 పరుగుల లక్క్ష్యంతో న్యూజిలాండ్‌ బరిలోకి దిగింది. మహిళల ప్రపంచ కప్‌లో భాగంగా భారత్‌ తన తొలి మ్యాచ్‌ దాయాది పాక్‌తో మార్చ్‌ 6వ తేదీన(ఆదివారం) తలపడనుంది. ఉదయం 6.30ని. మ్యాచ్‌ ప్రారంభం అవుతుంది. ఆసీస్‌, ఇంగ్లండ్‌లు ఫేవరెట్‌గా ఉన్నాయి ఈసారి టోర్నీలో.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top