‘విక్టరీ.. విక్టరీ.. నాకు ఈ ఒక్కమాటే వినిపిస్తోంది’

Donald Trump Spiritual Advisor Leads Bizarre Prayer Secure Victory - Sakshi

వాషింగ్టన్‌: ‘‘నాకు జయధ్వానాలు వినిపిస్తున్నాయి. ఇదంతా పూర్తై పోయిందని ఆ దేవుడు నాకు చెప్పాడు. విక్టరీ, విక్టరీ, విక్టరీ ఈ ఒక్క మాటే నాకు వినిపిస్తోంది! దైవదూతలు బయల్దేరారు... ఆఫ్రికా నుంచి ఇప్పుడే ఇక్కడకు బయల్దేరారు, ఆ దేవుడు చెప్పినట్లుగానే వాళ్లు ఇక్కడకు రాబోతున్నారు. జయ జయ ధ్వానాలు మారుమోగుతున్నాయి’’ అంటూ అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆధ్యాత్మిక సలహాదారు పౌలా వైట్‌ ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ గెలుపు ఖాయమని చెప్పుకొచ్చారు. అయితే దుష్టశక్తుల కూటమి, ఆయన నుంచి విజయాన్ని దూరం చేసేందుకు ప్రయత్నిస్తోందంటూ డెమొక్రాట్లను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ట్రంప్‌ విజయాన్ని కాంక్షిస్తూ లాటిన్‌ భాషలో ప్రార్థనలు చేశారు. (చదవండి: చరిత్ర సృష్టించిన జో బైడెన్‌)

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో.. ‘‘పాలనా పగ్గాలు అందిస్తే ట్రంప్‌ ఏం చేశారో అందరూ చూశారు. అసలు ఇదంతా ఏంటి? ట్రంప్‌ ఇలాంటి అసాధారణ విశ్వాసాలు తనను గెలిపిస్తాయని భావిస్తున్నారా? ఆయన అస్సలు ఓటమిని అంగీకరించలేకపోతున్నారు’’ అంటూ తమదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితం పూర్తిస్థాయిలో వెలువడలేదన్న విషయం తెలిసిందే. డెమొక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ 264 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించి విజయానికి కేవలం ఆరు ఓట్ల దూరంలో ఉన్నారు. ఇక ప్రస్తుత అధ్యక్షడు డొనాల్డ్‌ ట్రంప్‌ 214 ఓట్లతో వెనుకబడిపోయారు. కౌంటింగ్‌ ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో జార్జియాలో పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపును అడ్డుకోవటానికి ట్రంప్‌ న్యాయపోరాటానికి దిగుతున్నట్లు తెలుస్తోంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top