కరోనాపై సీడీసీ వైఫల్యం ఎందుకు?

Coronavirus:How CDC Become A Trump Puppet - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచం నుంచి స్మాల్‌ పాక్స్‌ (తట్టు), అమెరికాలో పోలియోను సమూలంగా నిర్మూలించి ప్రజారోగ్య వ్యవస్థలో స్వర్ణ ప్రమాణంగా నిలిచి ప్రపంచ దేశాల నీరాజనాలందుకున్న అమెరికాలోని ‘సెంటర్స్‌ ఫర్‌ డిసీస్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ)’ సంస్థ నేడు కరోనా కట్టడి విషయంలో అబాసుపాలయింది. అమెరికాలో నేటికి కరోనా కేసులు దాదాపు 94 లక్షలకు చేరుకోగా మతుల సంఖ్య 2,35,000లకు చేరుకుంది. అట్లాంటా కేంద్రంగా పని చేస్తోన్న సీడీసీ ఈసారి ఎందుకు విఫలమైంది ? అందుకు బాధ్యులెవరు?

సీడీసీలో 30 ఏళ్ల అనుభవం కలిగిన ప్రముఖ అంటు రోగాల నిపుణులు జాయ్‌ బట్లర్‌ ఏం చేస్తున్నారు? అంటు రోగాల ఆటకట్టించడంతోపాటు వాటి మూలాలను కనిపెట్టడంలో డెటిక్టివ్‌ తెలివి తేటలు కలిగిన బట్లర్‌ సేవలు ఎందుకు అందుబాటులో లేవు ? అమెరికాపై ఆంథ్రాక్స్‌ దాడి దర్యాప్తులో ఎఫ్‌బీఐ ఆయన అందించిన సహకారం, హెచ్‌1ఎన్‌1 ఫ్లూకు వ్యాక్సిన్‌ పంపిణీలో ఆయన సేవలు మరువ లేనివి. అలాంటి వ్యక్తి సీడీసీకి అందుబాటులో ఉండగా, కరోనా వైరస్‌ కట్టలుతెంచుకొని ఎందుకు విజంభిస్తోంది ? 74 ఏళ్ల సీడీసీ చరిత్రలో 2020 సంవత్సరం ఒక్కటే చీకటి అధ్యాయంగా సీడీసీ వర్గాలే చెబుతున్నాయంటే అందుకు బాధ్యులెవరు? (9 లక్షల వైరస్‌లు మానవులపై దాడి!)

తమ కార్యకలాపాల్లో అణువణువున దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కార్యాలయం జోక్యం చేసుకోవడం వల్లనే కరోనా వైరస్‌ను నిలువరించడంలో సీడీసీ ఏం చేయలేక చేతులెత్తేయాల్సి వచ్చిందని బట్లర్‌ వర్గాలు ఆరోపిస్తున్నాయి. లాక్‌డౌన్‌ను అమలు చేయడంలో, వాటిని ఎత్తివేయడంలో సీడీసీ నిర్దేశించిన ప్రమాణాలను, ప్రతిపాదనలను అధ్యక్ష భవనం పూర్తిగా కాలరాసిందని ఆ వర్గాలు చెబుతున్నాయి. ఎలాంటి నిబంధనలు లేకుండానే దేశంలోని ప్రార్థనా మందిరాలన్నింటినీ తెరచుకునేందుకు అధ్యక్ష భవనం అనుమతించిందని ఆరోపించాయి. (కరోనా వైరస్‌ మలి దశ పంజా!)

కరోనా వైరస్‌ పట్ల మొదటి నుంచి నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తు వచ్చినా ట్రంప్‌ ప్రవర్తనను, తాము వ్యక్తిగత వ్యవహారమని సరిపెట్టుకున్నామని, అదే చివరికి దేశం పాలిట ప్రాణాంతకం అవుతుందని భావించలేదని సీడీసీ వర్గాలు పేర్కొన్నాయి. ‘కరోనా నన్నేమీ చేయలేదు’ అంటూ మొదటి నుంచి మాస్క్‌ కూడా ధరించని ట్రంప్, చివరకు తనతోపాటు భార్యకు కూడా కరోనా రావడంతో తొలి సారిగా మాస్క్‌ ధరించిన విషయం తెల్సిందే. రెండేళ్ల క్రితం సీడీసీ డైరెక్టర్‌గా ట్రంప్‌ నియమించిన రాబర్ట్‌ రెడ్‌ ఫీల్డ్, ఆఫీసు రాకుండా రోజు అధ్యక్ష భవనంకు వెళ్లి అక్కడ హాజరు వేయించుకునేవారనే విమర్శలు కూడా గత కొంత కాలంగా వినిపిస్తున్నాయి. 

చైనాలోని వూహాన్‌ నగరంలో కొత్త రకం నిమోనియా కేసులు వచ్చిన విషయాన్ని చైనా తర్వాత గుర్తించిన శాస్త్రవేత్తల్లో సీడీసీ సీనియర్‌ శాస్త్రవేత్త అన్నే షూచాట్‌ ఒకరు. 2003లో సార్స్‌ మూలాలను కనుగొనేందుకు ఆమె చైనా వెళ్లారు. అంటు రోగాలపై ప్రజాదరణ పొందిన ‘కంటేజియస్‌’ హాలివుడ్‌ చిత్రంలో కేట్‌ విన్సిలేట్‌ పాత్రకు అన్నే షూచాట్‌యే స్ఫూర్తి. వుహాన్‌లో అంతు చిక్కని నిమోనియా కేసులను పరిశీలించాల్సిన అవసరం ఉందంటూ 2019, డిసెంబర్‌ 31 ఉదయం 8.25 గంటలకు బట్లర్‌తోపాటు ఇతర సహచరులకు షూచాట్‌ ఈ మెయిల్‌ పంపించారు. (నేను సూపర్‌ మ్యాన్‌ను: ట్రంప్‌)

ఆ తర్వాత వారంతా సమావేశమై కొత్త వైరస్‌ గురించి చర్చించారు. అప్పటికే చైనాలో 27 కేసులు బయట పడినట్లు గుర్తించారు. దేశాధ్యక్ష భవనాన్ని కూడా హెచ్చరించారు. అధ్యక్ష భవనం వారిని పట్టించుకోక పోవడమే కాకుండా, దాన్నో రాజకీయ వ్యవహారంగా చూసింది. పర్యవసానమే సీడీసీ వైఫల్యమని బట్లర్‌ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ ఆరోపణలను, విమర్శలను  సీడీసీని పర్యవేక్షించే ‘డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ హ్యూమన్‌ సర్వీసెస్‌’ అధికార ప్రతినిధి ఖండించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top