
ఢాకా: బంగ్లాదేశ్ రాజకీయాల్లో మళ్లీ నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు వార్తలు బయటకు వస్తున్నాయి.
బంగ్లాదేశ్‌లో రాజకీయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, రాజకీయ పార్టీల మధ్య సఖ్యత కుదరకపోవడంతోనే యూనస్ తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, ఆయన రాజీనామా గురించి సమాచారం వచ్చిందని నేషనల్ సిటిజన్ పార్టీ చీఫ్ నహిద్ ఇస్లామ్ తెలిపారు. ఈ విషయంపై యూనస్‌తో మాట్లాడుతానని వెల్లడించారు. అలాగే.. దేశ భద్రత, భవిష్యత్తు కోసం కలిసి పనిచేయాలని కోరుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు. అందరూ ఆయనకు సహకరిస్తారని తాను ఆశిస్తున్నట్టు వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీలు ఐక్యతను ఏర్పరచుకుని ఆయనకు సహకరిస్తాయనే నమ్మకం ఉందన్నారు.
Will Muhammad Yunus resign as caretaker to the interim government in Bangladesh? This BBC Bangla report quotes National Citizen Party leader Nahid Islam as saying Yunus is thinking of retirement. pic.twitter.com/GIsP3WqiaI
— Deep Halder (@deepscribble) May 22, 2025
యూనస్‌ను సవాళ్లు..
ఇదిలా ఉండగా.. గత కొద్ది రోజులుగా యూనస్ ప్రభుత్వం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. తాత్కాలిక ప్రభుత్వ అధినేత యూనస్, ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జమాన్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో మొదట్లో మిత్రులుగా ఉన్న వీరిద్దరూ ఇప్పుడు ఎన్నికల నిర్వహణ, సైనిక జోక్యం, యూనస్ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాల కారణంగా ఇద్దరి మధ్య సఖ్యత లోపించినట్టు తెలిసింది.
ఇక, గతేడాది ఆగస్టులో భారీ విద్యార్థి నిరసనల నేపథ్యంలో షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయారు. అనంతరం, జరిగిన చర్చల తర్వాత.. సంస్కరణలు చేపట్టి, త్వరితగతిన ఎన్నికలు నిర్వహిస్తామన్న హామీతో యూనస్ తాత్కాలిక ప్రభుత్వానికి నేతృత్వం వహించారు. తొలినాళ్లలో ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జమాన్ ఈ మార్పును సమర్థించినప్పటికీ, ఎన్నికల నిర్వహణలో యూనస్ జాప్యం చేయడం, శిక్షపడిన ఇస్లామిస్ట్ నాయకులను, బంగ్లాదేశ్ రైఫిల్స్ (బీడీఆర్) తిరుగుబాటుదారులను విడుదల చేయడం వంటి చర్యలతో ఇరు వర్గాల మధ్య దూరం పెరిగింది.
యూనస్‌కు సైనిక సలహాదారుగా నియమితులైన లెఫ్టినెంట్ జనరల్ కమ్రుల్ హసన్, అమెరికా రాయబారితో సమావేశమై తదుపరి ఆర్మీ చీఫ్ పదవికి మద్దతు కోరినట్లు ఆరోపణలు రావడంతో పరిస్థితి మరింత దిగజారింది. ఇది సైనిక నిబంధనల ఉల్లంఘనగా భావించిన జనరల్ వాకర్, హసన్‌ను తొలగించాలని మే 11న ప్రయత్నించగా, యూనస్ ఆ ఆదేశాలను అడ్డుకున్నారు.

‘బ్లడీ కారిడార్’
మరోవైపు.. యూనస్ తీరుపై అసంతృప్తితో ఉన్న సైన్యం మయన్మార్ సరిహద్దుల్లో మానవతా కారిడార్ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం తెలపడంపై మండిపడింది. అది ‘బ్లడీ కారిడార్’ అంటూ ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జమాన్ వ్యతిరేకత వ్యక్తం చేయడంతో యూనస్ సర్కారు వెనక్కి తగ్గింది. అలాంటిదేమీ లేదని ప్రకటిస్తూ ఆర్మీతో కాళ్లబేరానికి వచ్చింది. కారిడార్ వ్యవహారంపై బంగ్లాదేశ్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది దేశ సార్వభౌమత్వానికి భంగకరంగా మారడంతోపాటు అమెరికా భౌగోళిక రాజకీయాలకు అనుకూలంగా మారనుందని ఆందోళన వ్యక్తమవుతోంది.
అంతేకాదు, యూనస్, ఆయన అనుచరగణం దేశంలో ఎన్నికలు నిర్వహించకుండానే మరింత కాలం అధికారంలో కొనసాగేందుకు అమెరికాకు వత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ‘బంగ్లాదేశ్‌లో మిగిలి ఉన్న ఏకైక విశ్వసనీయ, లౌకిక వ్యవస్థ సైన్యం. దేశ నిష్పాక్షిక సంరక్షకత్వ బాధ్యతల్లో ఆర్మీ ఉంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఇటీవలి కాలంలో అసహనంతో ఉంది. విషయం తెలుసుకున్న యూనస్ ప్రభుత్వం సైన్యంతో ఘర్షణ వాతావరణం తలెత్తకుండా జాగ్రత్తగా పావులు కదుపుతోంది’ అని పరిశీలకులు అంటున్నారు.
వకారుజ్జమాన్ ఏమన్నారు?
రఖైన్ కారిడార్‌ను బ్లడీ కారిడార్ అంటూ ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జమాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని ఢాకా ట్రిబ్యూన్ పేర్కొంది. ‘దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించే ఎటువంటి చర్యలోనూ బంగ్లాదేశ్ ఆర్మీ పాలుపంచుకోదు. ఎవరినీ అలా చేయనివ్వదు’అని ఆర్మీ చీఫ్ బుధవారం యూనస్ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వానికి గట్టి వార్నింగిచ్చారు. ‘దేశ ప్రయోజనాలకే మా అత్యధిక ప్రాధాన్యం. ఆ తర్వాతే ఏ విషయమైనా. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా రాజకీయ ఏకాభిప్రాయం తప్పనిసరి’అంటూ ఆయన కుండబద్దలు కొట్టారు. అంతేకాదు, ‘సాధ్యమైనంత త్వరగా దేశంలో ఎన్నికల జరపాలి. మిలటరీ అంశాల్లో జోక్యం మానాలి. రఖైన్ కారిడార్ ప్రాజెక్టు వంటి కీలకమైన అంశాలపై ఆర్మీని పరిగణనలోకి తీసుకోవాలి’అని ఆయన యూనస్‌ను కోరారని ఢాకా ట్రిబ్యూన్ తెలిపింది.