
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా వీచిన కాంగ్రెస్ గాలిలో సైతం నగరంలో పరాజయాన్ని మూటకట్టుకోవాల్సి రావడంతో అధిష్టానం అంతర్మథనంలో పడింది. గ్రేటర్ పరిధిలోని అర్బన్ అసెంబ్లీ స్థానాలన్నింటిలో ఓటమి పాలు కావడాన్ని జీర్ణించుకోలేక పోతోంది. సాక్షాత్తూ రాష్ట్ర రాజకీయాలకు గుండె కాయలాంటి హైదరాబాద్ గడ్డు పరిస్థితి నెలకొనడాన్ని త్రీవంగా పరిగణించింది. ఎన్నికల ఫలితాలు, అందుకు కారణాలను విశ్లేషించి.. కనీసం జీహెచ్‌ఎంసీ ఎన్నికల వరకై నా సంస్థాగతంగా బలోపడేందుకు పార్టీ వీడిన పాత పార్టీ శ్రేణులను తిరిగి ఘర్ వాపసీకి చర్యలకు ఉపక్రమంచింది. అందులో భాగంగా టికెట్ ఆశించిన భంగపడి పార్డీ వీడిన వారితో సంప్రదింపులు చేస్తోంది. పార్టీలో అన్యాయం జరిగిన మాట వాస్తవమే.. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు జెండా మోసి.. అధికారంలోకి వచ్చే ముందు పార్డీ వీడటం దురదృష్టకరం. జరిగింది.. జరిగిపోయింది. సర్దుకుపోదాం రండి అంటూ విజ్ఞప్తి చేస్తోంది.
కీలక నేతలపై నజర్..
గత ఎన్నికల ముందు పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో టికెట్ ఆశించిన కీలక నేతలు పార్టీని వీడారు. హైదరాబాద్ నగరంతో పాటు శివార్ల సెగ్మెంట్లలో సైతం ఇదే పరిస్థితి కొనసాగింది. కొందరు.. బీఆర్‌ఎస్, మరికొందరు బీజేపీ పార్టీలో చేరారు. ఉప్పల్, మల్కాజిగిరి, ఎల్బీనగర్, మహేశ్వరం, ముషీరాబాద్, జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి, ఉప్పల్, అంబర్‌పేట, కుత్బుల్లాపూర్ తదితర అసెంబ్లీ సెగ్మెంట్ల చెందిన ముఖ్య నేతలు పార్టీ వీడారు. వారి వెంట పార్టీ కేడర్ సైతం నడిచింది. అంతకు ముందు సైతం ముఖ్యమైన మరికొందరు నేతలు పార్టీ వీడారు. తిరిగి వారిని పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. దీంతో కొందరు నేతలను నుంచి సానుకూలత వ్యక్తమైంది.
టార్గెట్ జీహెచ్‌ఎంసీ ఎన్నికలు
లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ ఘర్ వాపసీకి సిద్ధమైంది. మరో ఏడాదిన్నర కాలంలో బల్దియా ఎన్నికలు జరగనుండటంతో సంస్థాగతంగా బలపేడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. మళ్లీ ఆ పరిస్థితి రావద్దని ప్రయత్నిస్తోంది.
సర్దుకుపోదాం రండి
కాంగ్రెస్‌ను వీడిన నేతలకు అధిష్టానం పిలుపు
గ్రేటర్ ఫలితాల విశ్లేషణతో ఆహ్వానం
పార్టీ బలోపేతం దిశగా కార్యాచరణ
పలువురు నుంచి సానుకూల స్పందన
