
హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ ఈ నెల 8న నగరానికి రానున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు ఘనంగా స్వాగతం పలికేందుకు ఆ పార్టీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి. కర్ణాటకలో ఈ నెల 8 సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారానికి తెర పడనుంది. బళ్లారి నుంచి సాయంత్రం ఆరున్నర గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ప్రియాంక చేరుకోనున్నారు.
అటు నుంచి నేరుగా ఎల్బీనగర్ చౌరస్తాకు వస్తారు. తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి విగ్రహానికి పూల మాల వేసి.. నివాళి అర్పించనున్నారు. అటు నుంచి నిరుద్యోగులతో కలిసి ర్యాలీగా సరూర్‌నగర్ స్టేడియానికి చేరుకోనున్నారు. సాయంత్రం ఎనిమిది గంటలకు సరూర్‌నగర్ స్టేడియం వేదికగా నిర్వహించే నిరుద్యోగ జంగ్ సైరన్ సభలో ఆమె పాల్గొంటారు. తెలంగాణలోనూ సాధారణ ఎన్నికలు సమీపిస్తుండటం, ఇదే సమయంలో ప్రియాంక రాజకీయ సభలకు హాజరవుతుండటంపై సర్వత్రా ఆసక్తిగా మారింది.