
ఉప్పల్: ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నేటి నుంచి మే 18 వరకు జరగనున్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాచకొండ సీపీ దేవేందర్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. శనివారం ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో మల్కాజిగిరి డీసీపీ జానకి, ట్రాఫిక్ డీసీపీ అభిషేక్ మహంతిలతో కలిసి బందోబస్తు వివరాలను వెల్లడించారు.
బందోబస్తు ఇలా..
● 1500 మంది పోలీసులు, సెక్యూరిటీ వింగ్, 400 మంది ట్రాఫిక్ సిబ్బంది, లా అండ్ ఆర్డర్, నాలుగు ప్లాటూన్ల టీఎస్‌ఎస్‌పీ బృందాలు, ఆరు ప్లటూన్ల ఆర్మ్‌డ్ సిబ్బంది, రెండు ఆక్టోపస్ టీంలు, మౌంటెడ్ పోలీస్, వజ్రా తదితర సిబ్బందితో భారీ బందో బస్తును ఏర్పాటు చేశారు. వీరితో పాటు ఎస్‌బీ, సీసీఎస్, ఎస్‌ఓటీ, రెండు ఫైర్ ఇంజిన్లు, అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచారు. ఉప్పల్ స్టేడియం, దాని పరిసర ప్రాంతాల్లో మొత్తం 340 సీసీ కెమెరాలను అమర్చారు.
సెల్‌ఫోన్లకే అనుమతి..
● స్టేడియంలోకి కేవలం సెల్‌ఫోన్లనే అనుమతిస్తారు. ల్యాప్ టాప్‌లు, బ్యానర్లు, వాటర్ బాటిల్స్, కెమారాలు, సిగరెట్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, మ్యాచ్‌స్టిక్ బాక్స్‌లు, లైటర్లు, పదునైన వస్తులు, ప్లాస్టిక్ వస్తువులు, బైనాక్యులర్స్, పెన్నులు, బ్యాటరీలు, ఫర్‌ఫ్యూమ్స్, బయటి నుంచి తీసుకుచ్చే తినుబండారాలను అనుమతించరు.
తాగునీరు, తిను బండారాలు లభ్యం
● తిను బండారాలు, తాగునీరు అన్ని రకాల ఆహార పదార్థాలను నిర్వాహకుల ద్వారా స్టేడియం లోపల విక్రయించనున్నారు. నిర్ణీత ధరలకే ఆహార పదార్థాలను స్టాళ్ల నిర్వాహకులు విక్రయించాలి. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
మెట్రో రైళ్ల సమయాల పొడిగింపు..
● మ్యాచ్ జరిగే రోజుల్లో అదనంగా మెట్రో రైల్ ట్రిప్పులను పెంచనున్నారు. రైళ్లు అర్ధరాత్రి ఒంటి గంట వరకు తిరుగుతాయి.
మహిళల భద్రతకు షీటీంలు
మహిళా ప్రేక్షకుల భద్రతకు ప్రాధాన్యత నిస్తున్నామని, వేధించే వారిపై షీటీంలు కఠిన చర్యలు తీసుకుంటారు. ఇప్పటికే సెల్‌ఫోన్‌ల ద్వారా బెట్టింగ్‌లకు పాల్పడుతున్న వారిపై నాలుగు కేసులను బుక్ చేశారు.