
బంజారాహిల్స్: విశ్రాంత ఐపీఎస్ అధికారి ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంటికి తాళం వేసి తన కుమారుడి వద్దకు వెళ్లిన సమయంలో.. దొంగలు ఇంటికి కన్నం వేసి బంగారు, వెండి వస్తువులను అపహరించారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. జూబ్లీహిల్స్ రోడ్ నెం.72లోని ప్రశాసన్‌నగర్‌లో నివసించే విశ్రాంత ఐపీఎస్ అధికారి కొమ్మి ఆనందయ్య ఈ నెల 16న ఇంటికి తాళం వేసి తన భార్యతో కలిసి కాకినాడలో నివసించే కుమారుడు, కాకినాడ మున్సిపల్ కమిషనర్ కె. రమేష్ ఇంటికి వెళ్లారు.
ఈ నెల 25న ఉదయం ఆయన డ్రైవర్ ఫోన్ చేసి ఇంట్లోని బంగారు ఆభరణాలు చోరీ అయిన విషయాన్ని తెలిపాడు. హుటాహుటిన కాకినాడ నుంచి శనివారం హైదరాబాద్‌కు చేరుకున్న ఆనందయ్య ఇంట్లోకి వచ్చి చూడగా రెండు బెడ్రూంల తలుపులు తెరిచి ఉన్నాయి. ఓ బెడ్రూంమ్‌లో అల్మరా పగులగొట్టి ఉంది. అందులోని 30 తులాల బంగారు ఆభరణాలు, పూజా మందిరంలోని 20 కిలోల వెండి వస్తువులు, రూ.40 వేల నగదు, 500 యూఎస్ డాలర్లు, ఆరు లేడీస్ బ్రాండెడ్ వాచీలు, రెండు జెంట్స్ బ్రాండెడ్ వాచీలు చోరీకి గురయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అర్ధరాత్రి 1.33 గంటల వేళ..
జూబ్లీహిల్స్ క్రైం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. ఆనందయ్య ఇంటి ముందు ఉన్న సీసీ ఫుటేజీ పరిశీలించగా శుక్రవారం అర్ధరాత్రి 1.33 గంటల ప్రాంతంలో 25 సంవత్సరాల వయసున్న యువకుడు ఇంటి పైభాగంలోకి వెళ్లి తలుపులు గట్టిగా నొక్కడంతో అవి తెరుచుకున్నాయని అక్కడి నుంచి మెట్ల మీదుగా మొదటి అంతస్తులో ఉన్న బెడ్రూం వరకు వెళ్లినట్లుగా గుర్తించారు. తనతో పాటు తెచ్చుకున్న రాడ్‌తో బెడ్రూం తాళాలు తెరిచి అందులో ఉన్న నగదు, ఆభరణాలు, వెండి వస్తువులు, కిచెన్‌లో ఉన్న వెండి ప్లేట్లు బ్యాగులో వేసుకొని గంట వ్యవధిలోనే బయటికి వచ్చినట్లుగా గుర్తించారు.
ప్రశాసన్‌నగర్ నుంచి ఫిలిం చాంబర్ రోడ్డు వరకు నడుచుకుంటూ వచ్చిన నిందితుడు అక్కడి నుంచి ఓ స్కూటరిస్ట్‌ను లిప్ట్ అడిగి.. కొద్దిసేపటికే మరో స్కూటరిస్ట్‌ను లిఫ్ట్ అడిగి రోడ్ నెం. 45 వైపు వెళ్లిన దృశ్యాలు సీసీ ఫుటేజీల్లో నమోదయ్యాయి. ఈ మేరకు పోలీసులు నిందితుడి కోసం లోతుగా విచారణ చేపట్టారు. ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారు. సీసీ ఫుటేజీల్లో దొంగకు సంబంధించిన ఊహా చిత్రాన్ని నమోదు చేశారు. నాలుగు బృందాలు గాలింపు చేపట్టాయి. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.