సాక్షి, సిటీబ్యూరో: వర్షాకాలంలో వరద ముప్పు సమస్యల పరిష్కారానికి మూసీ, ఈసాలపై నిర్మించ తలపెట్టిన 15 హైలెవల్ బ్రిడ్జిల్లో మరో బ్రిడ్జి పనులకు టెండర్లు పిలిచారు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో మూసీపై మూసారాంబాగ్ వద్ద నిర్మించనున్న హైలెవల్ బ్రిడ్జికి తాజాగా టెండర్లు పిలిచారు. బ్రిడ్జి అంచనా వ్యయం రూ.52 కోట్లు. టెండర్లు పూర్తయ్యాక బ్రిడ్జి పనులు పూర్తయ్యేందుకు దాదాపు ఏడాది సమయం పట్టనుంది. అంటే ఈ సంవత్సరం వర్షాకాలంలోనూ ప్రజలకు కడగండ్లు తప్పవు. గతంలో కురిసిన భారీ వర్షాలతో తలెత్తిన ముంపు సమస్యల నేపథ్యంలో మూసీ,ఈసాలపై బ్రిడ్జిల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధం కావడం తెలిసిందే. గత సంవత్సరం మూసారాంబాగ్ ముంపుసమయంలో పర్యటించిన మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, మూసారాంబాగ్, చాదర్‌ఘాట్‌ల వద్ద బ్రిడ్జిల నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభిస్తామని ప్రకటించారు. వచ్చే వర్షాకాలం నాటికి సమస్యలు లేకుండా చేయనున్నట్లు పేర్కొన్నప్పటికీ, ఇప్పటి వరకు టెండర్లు పిలవలేదు. మొత్తం 15 బ్రిడ్జిల్లో హెచ్‌ఆర్‌డీసీఎల్ ఆధ్వర్యంలో నిర్మించనున్న మూడు బ్రిడ్జిల్లో రెండింటికి, కుడా ఆధ్వర్యంలో నిర్మించనున్న ఒక బ్రిడ్జికి ఇప్పటికే టెండర్లు పిలిచారు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నిర్మించాల్సిన నాలుగు బ్రిడ్జిల్లో ఒకదానికి ప్రస్తుతం టెండర్లు పిలిచారు. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ఏడు బ్రిడ్జిలు నిర్మించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. వేసవిలోనే పనులు చేపట్టేందుకు మరికొన్ని బ్రిడ్జిలకు కూడా టెండర్లు పిలిచేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
మూసారాంబాగ్ బ్రిడ్జికి మోక్షం
వరద సమస్యల పరిష్కారానికి చర్యలు
టెండర్లు పిలిచిన జీహెచ్‌ఎంసీ