
భక్తి గీతాల్లోనే సంతృప్తి
● దక్షిణాదిన కళలకు గౌరవం ఎక్కువ..
● తెలుగులో పాడింది తక్కువే.. కానీ అమితమైన గౌరవం దక్కింది
● ఎస్.పి బాలుతో కలిసి పాడాను..
● ప్రముఖ గాయని, పద్మశ్రీ అనురాధ పౌడ్వాల్
సాక్షి, సిటీబ్యూరో: ‘తెలుగు సాహిత్యమన్నా, ఇక్కడి ప్రజల ప్రేమాభిమానాలన్నా నాకు అమితమైన ఇష్టం’ అని బాలీవుడ్ సింగర్, పద్మశ్రీ అనురాధ పౌడ్వాల్ అన్నారు. తనకు భక్తి గీతాలు పాడడంలోనే ఇంతో సంతృప్తి ఉంటుందని చెప్పారు. రవీంద్రభారతి వేదికగా శుక్రవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో అవార్డు అందుకోవడానికి పౌడ్వాల్ ప్రత్యేకంగా నగరానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడుతూ పలు విషయాలను పంచుకున్నారు. సినిమా పాటల కన్నా ఆధ్యాత్మిక, భక్తి గీతాలను ఆలపించడమే తనకెంతో ఇష్టమని అన్నారు. అందులో దొరికే సంతృప్తి మరెక్కడా ఉండదని పేర్కొన్నారు. ప్రస్తుత తరం ఎంతో అభివృద్ధి చెందిందని, ఈ తరం గాయకులు అద్భుతంగా పాడుతున్నారని ఆమె తెలిపారు. తెలుగులో తక్కువ పాటలు పాడినప్పటికీ ఇక్కడి ప్రజల అభిమానం తనని ఆకట్టుకుందని అన్నారు. ప్రముఖ గాయకులు ఎస్.పి బాలసుబ్రమణ్యంతో కలిసి పాడానని, జానకితో కూడా గొంతు కలిపానని ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకొన్నారు. బాలుతో మంచి అనుబంధం ఉండేది, తనంటే ఎంతో గౌరవం. సుశీలతో పాడలేదు కానీ తన వ్యక్తిత్వం ఉన్నతమైందని అన్నారు. ముఖ్యంగా దక్షిణాదిన కళలకు, కళాకారులకు మంచి గౌరవం ఇస్తారని కొనియాడారు. నగరంతో తనకు మంచి అనుబంధం ఉందని, ఏడాదిలో 4, 5 సార్లు హైదరాబాద్‌లో కార్యక్రమాలకు హాజరయ్యానని చె ప్పారు. గానంతో పాటు సామాజిక సేవ అంటే తనకు అత్యంత ఇష్టమైన విషయమని, అందుకే తానే స్వయంగా సూర్యోదయ అనే ఫౌండేషన్ ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలను చేపట్టానని తెలిపారు. తన జీవితం గానంతో ముడిపడి ఉందని, ప్రస్తుతం ప్రత్యేకంగా ఆది శంకరాచార్య భజనలను చేపట్టానని అన్నారు.