
● అంగడి సరుకులా వ్యక్తిగత వివరాలు
● రూ.2 వేలకే 50 వేల మంది సమాచారం విక్రయం
● ఫోన్ నంబర్, చిరునామా, బ్యాంకు వివరాలు, లోన్లు, ఆధార్, పాన్ నంబర్లు సైతం
● ఉత్తరాది రాష్ట్రాల్లో నకిలీ కాల్ సెంటర్లు
● మెసేజ్‌లు, ఫోన్లు చేస్తూ మోసాలు
● డేటా ప్రైవసీ బిల్లు అమలుతోనే రక్షణ
సాక్షి, సిటీబ్యూరో: సుమారు 17 కోట్ల మంది వ్యక్తిగత వివరాలను తస్కరించి, అంగడి సరుకులా విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఫోన్ నంబర్ నుంచి చిరునామా, బ్యాంకు వివరాలు, రుణాలు, ఆధార్, పాన్ కార్డు నంబర్లు వంటి సమస్త సమాచారం సైబర్ నేరస్తులు దొంగిలించి, విక్రయిస్తున్నారు. రూ.2 వేలకు 50 వేల మంది వ్యక్తిగత వివరాలను విక్రయిస్తూ.. నెలకు రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు.
బ్యాంకు ఖాతా నంబర్, రుణాలు, ఈఎంఐ చెల్లింపులు, క్రెడిట్, డెబిట్ కార్డు నంబర్లు, సీవీవీ, పిన్ నంబర్లతో సహా గోప్యంగా ఉండాల్సిన వ్యక్తిగత వివరాలు అత్యంత సులువుగా సైబర్ నేరస్తుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. వాటి సహాయంతో కస్టమర్లకు ఫోన్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. బ్యాంకు మాజీ ఉద్యోగులు, థర్డ్ పార్టీ ఏజెన్సీలు ఖాతాదారుల వివరాలను విక్రయిస్తున్నట్లు పలు కేసుల్లో సైబరాబాద్ పోలీసులు గుర్తించారు.
డేటా ప్రైవసీ బిల్లుతోనే రక్షణ..
కస్టమర్ల డేటాకు రక్షణ కల్పించే డేటా ప్రైవసీ బిల్లు ప్రతిపాదన దశలోనే ఉంది. కస్టమర్ల వ్యక్తిగత సమాచార భద్రతకు ఆయా సంస్థలు, యాజమాన్యాలు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఒకవేళ కస్టమర్ అనుమతి లేకుండా వ్యక్తిగత వివరాలు బయటికి వస్తే ఎలా బహిర్గతమైందో వెల్లడించాల్సి ఉంటుంది. జరిగే మోసాలకు, నేరాలకు కూడా వారిదే బాధ్యత.
మన అవసరాలేంటో విశ్లేషిస్తూ..
సైబర్ నేరస్తులు బీహార్, రాజస్థాన్, జార్ఖండ్, ఢిల్లీ తదితర ఉత్తరాది రాష్ట్రాల్లో నకిలీ కాల్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగులను ఆకర్షించి, వారిని కాల్ సెంటర్ ఉద్యోగులుగా నియమించుకుంటున్నారు. వ్యక్తిగత వివరాలను విశ్లేషించి మన అవసరాలేంటో నేరస్తులు గుర్తిస్తున్నారు. వాటిని అస్త్రంగా చేసుకుని కాల్ సెంటర్ల ఉద్యోగులు కస్టమర్లకు ఫోన్ చేస్తారు. స్థానిక భాషలో మాట్లాడుతూ మన అవసరం గురించి ఆరా తీయడంతో కస్టమర్లు సులువుగా నమ్మేస్తారు. చార్జీలు, పన్నులు అంటూ మాయమాటలతో వారిని బుట్టలో వేసి, అందినకాడికి దోచేస్తున్నారు.
ఎలా లీక్ అవుతున్నాయంటే..
● గూగుల్‌లో వెతికే సమాచారాన్ని సేకరించేందుకు సైబర్ నేరస్తులు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. దీంతో మనం గూగుల్‌లో దేనికోసం శోధించినా సరే.. వెంటనే ఆయా సమాచారం నేరస్తులకు చేరిపోతుంది.
● ఉత్పత్తులు కొనుగోలు చేసే ముందు వాటి నాణ్యత, ఇతర వివరాలను తెలుసుకునేందుకు తయారీ సంస్థల వెబ్‌సైట్లను సందర్శిస్తుంటాం. ఈ సందర్భంగా కొన్ని సంస్థలు ఫోన్ నంబర్లు, ఈ–మెయిల్ ఐడీలు, నమోదు చేయాలని కోరుతుంటాయి. పెట్రోల్ బంకులు, షాపింగ్ మాల్స్‌లలో లక్కీ డ్రా తీసి విజేతలను ప్రకటిస్తామంటూ పేరు, ఫోన్ నంబర్లను సేకరిస్తుంటారు. ఇలా తీసుకున్న వివరాలను మార్కెటింగ్ సంస్థలకు కమీషన్ తీసుకుని విక్రయిస్తుంటారు.
● ఆన్‌లైన్ షాపింగ్ సంస్థలు, జాబ్ పోర్టల్స్ నుంచి కస్టమర్ల డేటా లీకవుతుంది. ఫేస్‌బుక్, వాట్సాప్ యూజర్ల వివరాలు, ఆన్‌లైన్ షాపింగ్ కొనుగోలుదారుల వివరాలు సైతం నేరస్తుల చేతుల్లోకి చిక్కాయి.
● జిరాక్స్ సెంటర్లలో ఆధార్, ఓటర్ ఐడీ, పాన్ కార్డు... ఏదైనా జిరాక్స్ తీసుకునేందుకు వెళితే కొందరు అక్రమార్కులు కస్టమర్‌కు తెలియకుండా గుట్టుగా అదనపు జిరాక్స్‌లు తీస్తున్నారు. వీటిని సైబర్ ముఠాలకు విక్రయిస్తున్నారు. అనధికారిక ఏజెంట్ల వద్ద సిమ్ కార్డులు తీసుకునేముందు సమర్పించే డాక్యుమెంట్లు కూడా అక్రమార్కుల చేతుల్లోకి చేరుతున్నాయి.
అనుమానం వస్తే ఫిర్యాదు చేయండి
మీ వ్యక్తిగత సమాచారాన్ని గుర్తు తెలియని వ్యక్తులకు, వెబ్‌సైట్లలో సమర్పించకూడదు. బ్యాంకు ఖాతా వివరాలు, ఆర్థిక సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో పంచుకోకూడదు. మీ వ్యక్తిగత సమాచారం తస్కరించినట్లు గుర్తించిన వెంటనే పోలీసులు లేదా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలను సంప్రదించాలి.
– స్టీఫెన్ రవీంద్ర, పోలీసు కమిషనర్, సైబరాబాద్
