
సికింద్రాబాద్ బన్సీలాల్‌పేట్‌లోని చారిత్రక కోనేరు బావి (మెట్లబావి) చెత్తా చెదారం, వ్యర్థాల డంప్‌తో అస్తవ్యస్తంగా మారిన దుస్థితిపై ‘అలనాటి అద్భుత కట్టడం కోనేరు బావి’ శీర్షికన 2014లో ‘సాక్షి’ మొదటి కథనం ప్రచురించింది. పాలకుల నిర్లక్ష్యంతో నిరాదరణకు గురవుతోందని హెచ్చరించింది. అంతటితో ఆగిపోకుండా ‘మసకబారుతున్న చారిత్రక వైభవం’ పేరిట మరిన్ని కథనాలను ప్రచురించింది. ఎట్టకేలకు దిగివచ్చిన రాష్ట్ర ప్రభుత్వం చారిత్రక కట్టడాల పరిరక్షణకు నడుం బిగించింది. 2022 సంవత్సరంలో హెచ్‌ఎండీఏ ద రెయిన్ వాటర్ ప్రాజెక్టుతో కలిసి కోనేరు బావి సుందరీకరణకు శ్రీకారం చుట్టారు. సుమారు రూ.10 కోట్లతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు.


