
మైలవరపు శ్రీనివాసరావు దంపతులను సత్కరిస్తున్న రమణాచారి
చిక్కడపల్లి: వంశీ సంస్థ చేపట్టిన ఉగాది కళా సాహితీ పురస్కారాల ప్రదానం మహాయజ్ఞ తుల్యమని ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు. గురువారం రాత్రి చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభ ప్రధాన వేదికపై వంశీ ఆర్ట్స్ థియేటర్స్ ఇంటర్నేషనల్ నిర్వహణలో వంశీ శుభోదయం, శోభకృత్ నామ సంవత్సర ఉగాది సంబురాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ కేవీ రమణాచారి మాట్లాడుతూ కాలం దైవంతో సమానమని, దానిని సద్వినియోగం చేసుకున్న వారు ఉత్తములన్నారు. సాహితీవేత్త ఓలేటి పార్వతీశం మాట్లాడుతూ భాషకు సంబంఽధించి చేసుకునే ఏకై క పండుగ ఉగాది అన్నారు. ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాఽథ్ ఏర్పాటు చేసిన ఉత్తమ కథా రచయితలు పురస్కారాన్ని ఊహ, సురేంద్ర, శీలం , నాంగేంద్ర కాశీ, ఉమామహేష్‌లకు వీరేంద్రనాథ్ అందజేశారు. తొమ్మిది మందిని ఆదర్శదంపతులు పురస్కారంతో సత్కరించారు. వంశీ శుభోదయం పురస్కరాన్ని ప్రముఖ ప్రవచన కర్త మైలవరపు శ్రీనివాసరావు దంపతులకు డాక్టర్ రమణాచారి అందజేశారు. కార్యక్రమంలో దర్శకుడు రేలంగి నరసింహారావు, బొల్లినేని కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.