
సాక్షి, సిటీబ్యూరో: ‘బలగం’ లాంటి సినిమాలు మరిన్ని రావాలని సినీ నటడు, దర్శక– నిర్మాత ఆర్.నారాయణ మూర్తి అన్నారు. ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌రామ్ హీరో హీరోయిన్లుగా నటుడు వేణు ఎల్దండి దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘బలగం’. ‘దిల్’ రాజు ప్రొడక్షన్స్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 3న విడుదలై, సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శితమౌతుంది. చిన్న సినిమాగా విడుదలై, పెద్ద విజయం సాధించిన ‘బలగం’ చిత్రం యూనిట్‌ను తెలుగు సినిమా వేదిక ఉగాది నంది సత్కారంతో సత్కరించారు. ఈ వేడుకలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటులు కాదంబరి కిరణ్, రామ్ రావిపల్లి, రవికాంత్, నిర్మాతలు కూనిరెడ్డి శ్రీనివాస్, మోహన్ గౌడ్, గల్ఫ్ వాసు, అని ప్రసాద్, ప్రవీణ నాయుడు, వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న పలువురిని ఉగాది నంది పురస్కారంతో సత్కరించారు. ‘బలగం’ చిత్ర నిర్మాతలు హర్షిత్ రెడ్డి, హర్షిత, దర్శకుడు వేణు, హీరో ప్రియదర్శి, హీరోయిన్ కావ్య కల్యాణ్ రామ్, ఇతర నటీ నటులు సాంకేతిక నిపుణులను ఎఫ్‌డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం, ఆర్ నారాయణ మూర్తి, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ రుద్రరాజు పద్మరాజు నంది పురస్కారంతో సత్కరించారు. ఉగాది రోజున ‘బలగం’ చిత్రయూనిట్ మొత్తాన్ని సత్కరించిన తెలుగు సినిమా వేదిక అధ్యక్షులు విజయ్ వర్మ పాకలపాటికి, చిత్రనిర్మాతలు హర్షిత్ రెడ్డి, హన్షితలతో పాటు చిత్రయూనిట్ కృతజ్ఞతలు తెలిపారు. ‘బలగం’ లాంటి చిత్రాలు మరిన్ని రావాలని, ఈ చిత్రం ఒక దృశ్యకావ్యమని నటుడు దర్శక–నిర్మాత ఆర్. నారాయణమూర్తి, రుద్రరాజు పద్మ రాజు కొనియాడారు. త్వరలో ‘సింహా’ పేరుతో పురస్కారాలు ఇచ్చే యోచనలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని అనిల్ కుర్మాచలం వెల్లడించారు.
ఆర్. నారాయణమూర్తి