
గాయడిన సురేష్
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ క్యాంపస్‌లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పేపర్ లీకేజీ వ్యవహారంపై ఐక్య విద్యార్థి సంఘాలు శుక్రవారం మహా నిరసన దీక్ష, ప్రగతిభవన్‌కు నిరుద్యోగ మార్చ్ చేపట్టనున్నాయి. వీటికి తోడు వర్సిటీలో ఓయూ ఆధ్వర్యంలో పలు జాతీయ, అంతర్జాతీయ సదస్సులు జరగనున్నాయి. అయితే నిరుద్యోగుల మహానిరసన దీక్షకు అనుమతి లేదని అధికారులు పేర్కొంటున్నారు. రేవంత్ రెడ్డి దీక్షకు హాజరైతే అడ్డుకుంటామని బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం నాయకులు చెబుతుండగా, దీక్ష నిర్వహించి తీరుతామని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు స్పష్టం చేయడంతో టెన్షన్ నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు చేశారు.
హైటెన్షన్ వైర్లు తగిలి మహిళ మృతి
ఉప్పల్: ఇంటిపైన ఆరవేసిన దుస్తులు తీసుకునే క్రమంలో విద్యుత్ షాక్ తగిలి ఓ మహిళ మృతి చెందిన సంఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన వికాస్ పాటిల్, పూనమ్ పాటిల్(32) దంపతులు ఉప్పల్ కళ్యాణ్‌పురి కాలనీలో నివాసం ఉంటున్నారు. గురువారం పూనమ్ పాటిల్ ఇంటిపై దుస్తులు ఆరవేసింది. వాటిని తీసుకునేందుకు వెళ్లిన ఆమె వాటిలో కొన్ని హైటెన్షన్ వైర్లకు తగులుకుని ఉండటంతో ఇనుప రాడ్ సహాయంతో వాటిని తీసేందుకు ప్రయత్నించగా విద్యుత్ షాక్ తగిలి కుప్పకూలింది. కుటుంబ సభ్యుల సమాచారంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వ్యక్తి ఆత్మహత్యాయత్నం
చైతన్యపురి: కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న సంఘటన సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ జానకిరెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎల్‌బీనగర్ ఎన్‌టీఆర్ కాలనీకి చెందిన కంచె సురేష్(35) పెయింటర్‌గా పని చేస్తున్నాడు. మద్యానికి బానిసైన అతను తరచూ భార్య మమతతో గొడవ పడేవాడు. దీంతో ఏడాదిన్నరగా ఆమె ఇద్దరు పిల్లలతో సహా విడిగా ఉంటోంది. అప్పటి నుంచి సురేష్ ఒంటరిగా ఉంటున్నాడు. గురువారం మధ్యాహ్నం ఇంటి నుంచి కొత్తపేట చౌరస్తాకు వచ్చిన అతను తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీనిని గమనించిన స్థానికులు మంటలు ఆర్పి పోలీసులు, 108 సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 40 శాతం కాలిన గాయాలతో సురేష్ చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
● రోడ్డుపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న వైనం
● కుటుంబ కలహాలే కారణంగా గుర్తింపు