హిమాయత్‌నగర్: ఉద్యోగం కోసం గూగుల్‌లో సెర్చ్ చేసిన ఇద్దరు యువకులకు సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. ఒకరిని టెలిగ్రామ్ ద్వారా, మరొకరితో వాట్సాప్ ద్వారా పరిచయం చేసుకుని వారి నుంచి రూ.లక్షలు కాజేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ గురువారం బాధితులిద్దరూ సిటీ సైబర్‌క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే..షేక్‌పేటకు చెందిన యువకుడిని ఉద్యోగం ఇస్తామంటూ టెలిగ్రాం ద్వారా ఓ వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. టూరిస్టులకు సంబంధించిన పోస్టులను ప్రమోట్ చేయాలని..అలా చేస్తే అధిక లాభాలు వస్తాయంటూ నమ్మించాడు. 30 టాస్క్‌లు చేయాలని కోరడంతో బాధితుడు రూ.28 లక్షలతో వాటిని పూర్తి చేశాడు. అయితే ఒక్క రూపాయి లాభం ఇవ్వకపోగా ఉన్న వాటిని బ్లాక్ చేశారు. మలక్‌పేటకు చెందిన యువకుడిని వాట్సాప్ ద్వారా పరిచయం చేసుకున్న వ్యక్తి వరల్డ్ డెఫ్ కాయిన్ అనే వెబ్‌సైట్‌లో పెట్టుబడి పెట్టించి రూ.15లక్షలు కాజేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు.