
సాక్షి, సిటీబ్యూరో: పదో తరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో ‘స్టడీ మెటీరియల్’ అందుబాటులోకి వచ్చింది. ఎస్‌సీఈఆర్‌టీ నిపుణులచే పాఠ్యాంశాల్లోని కీలక అంశాలు సులభంగా అర్థమయ్యేలా ప్రత్యేక స్టడీమెటీరియల్‌ను రూపకల్పన చేయించింది. అభ్యాస దీపిక, స్ఫూర్తి పేరిట ప్రచురించిన వివిధ సబ్జెక్టుల స్టడీ మెటీరియల్‌ను ప్రభుత్వ, జెడ్‌పీహెచ్ పాఠశాల విద్యార్థులకు పంపిణీ చేశారు. మరోవైపు ఎస్‌సీఈఆర్‌టీ వెబ్‌సైట్‌లో స్టడీ మెటీరియల్‌ను అందుబాటులో ఉంచారు.
ప్రాంతీయ భాషల్లో సాంకేతిక పదాలు..
గత విద్యా సంవత్సరం మాదిరిగా కాకుండా మారిన మోడల్ పేపర్‌కు అనుగుణంగా 100 శాతం సిలబస్‌తో ఆంగ్లం, తెలుగు, ఉర్దూ మాధ్యమాల్లో మెటీరియల్‌ను రూపకల్ప చేశారు. గణితం, భౌతిక, రసాయన, జీవశాస్త్రాలు సహా సాంఘిక శాస్త్రంలోని సాంకేతిక పదాలను ఆంగ్లం, తెలుగు, హిందీ, కన్నడ, మరాఠీ, తమిళం భాషల్లో పొందుపర్చారు. ఇది ప్రాథమిక పరిభాషపై ప్రావీణ్యం పొందడం, ప్రశ్నపత్రాల్లో ఏకరూపతను పాటించడం, అనువాదంలో అస్పష్టతను నివారించడానికి దోహదపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కార్పొరేట్ సంస్థల నోట్స్ కంటే..
కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థలు సైతం ఎస్‌సీఈఆర్‌టీ స్టడీ మెటీరియల్‌పై ఆసక్తి కనబర్చుతున్నాయి. వాస్తవంగా ప్రైవేటు సంస్థలు ప్రత్యేకంగా రూపొందించే నోట్స్ కన్నా అద్భుతంగా ఉందని సబ్జెక్టు నిపుణులు పేర్కొంటున్నారు. ఆయా విద్యా సంస్థలు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసి విద్యార్థులకు అందజేస్తున్నారు. దీంతో ఎస్‌సీఈఆర్‌టీ స్టడీ మెటీరియల్‌కు ప్రాధాన్యం పెరిగింది. కొన్ని బుక్ సెంటర్లు ఈ మెటీరియల్‌ను విక్రయిస్తున్నాయి.
1.65 లక్షల విద్యార్థులు
గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులు సుమారు 1,65,135 మంది ఉన్నారు. వీరిలో హైదరాబాద్ జిల్లాలో 72,114, రంగారెడ్డి జిల్లాలో 49,574, మేడ్చల్ జిల్లాలో 43,447 మంది విద్యార్థులు ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
టెన్త్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్
100 శాతం సిలబస్‌తో రూపకల్పన
ఎస్‌సీఈఆర్‌టీ వెబ్‌సైట్‌లో అందుబాటులో