
కాచిగూడ: టీ తాగడానికి స్నేహితులతో కలిసి వెళ్తున్న ఓ ప్రైవేట్ ఉద్యోగిపై తాగిన మైకంలో గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడిచేసిన గాయపరిచిన సంఘటన కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ రామలక్ష్మణ రాజు తెలిపిన వివరాల ప్రకారం..కాచిగూడ లింగంపల్లి చౌరస్తా వద్ద నివాసముంటున్న అనిల్ కుమార్ ప్రైవేట్ ఉద్యోగి. బుధవారం సాయంత్రం తన ఇద్దరు స్నేహితులతో కలిసి కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద గల హోటల్‌లో టీ తాగడానికి ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు.
సీసీ షరాఫ్ ఆసుపత్రి సమీపంలోకి రాగానే ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు తాగిన మైకంలో ద్విచక్రవాహనంపై వస్తూ వెనుక నుంచి పలుమార్లు గట్టిగా హారన్ కొట్టారు. ఎందుకు హారన్ కొడుతున్నావని అనిల్ కుమార్ ప్రశ్నించాడు. దీంతో గొడవ పడ్డారు. ఆ ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులలో ఒకరు సడన్‌గా కత్తి తీసుకొని అనిల్ కుమార్‌పై దాడి చేశాడు. వెంటనే అక్కడ నుంచి పరారయ్యరు.
ఈ దాడిలో అనిల్ కుమార్‌కు గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న కాచిగూడ పోలీసులు చికిత్స కోసం అనిల్ కుమార్‌ను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలో ఉన్న సీసీ కెమెరాలు ఫుటేజీని పరిశీలించిన దాడికి పాల్పడిన ఒకరిని గుర్తించి ఆదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మరోవ్యక్తి ఖమ్మం పారిపోవడానికి ప్రయత్నించగా అతన్ని కూడా ఆదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.