● అప్పుడే గరిష్ట శిక్షా రేటు సాధ్యం
● రాచకొండ సీపీ చౌహాన్
సాక్షి, సిటీబ్యూరో: పోలీసులు, ప్రాసిక్యూటర్లు సమన్వయంతో పనిచేస్తే నేరస్తుడికి తగిన శిక్ష పడుతుందని, న్యాయ వ్యవస్థపై నమ్మకం ఏర్పడుతుందని రాచకొండ పోలీసు కమిషనర్ డీఎస్ చౌహాన్ అన్నారు. శనివారం నేరేడ్‌మెట్‌లోని సీపీ కార్యాలయంలో పోలీసు, ప్రాసిక్యూషన్ అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ శిక్షా రేటును పెంచే లక్ష్యంతో రాచకొండ కమిషనరేట్ పరిధిలో కేసుల విచారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి సూచనలు చేశారు. రాష్ట్రంలో గరిష్ట శిక్షా రేటులో అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు, కోర్టు డ్యూటీ ఆఫీసర్లను అభినందించారు. డ్రగ్స్ కేసులలోనూ చెక్‌లిస్ట్‌లను అనుసరిస్తూ నేరస్తులకు తగిన శిక్ష పడేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జాయింట్ కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ... కేసుల సత్వర పరిష్కారానికి, సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం శిక్షా రేటును సాధించడానికి, బాధితులు, వారి కుటుంబాలకు సకాలంలో న్యాయం అందించేందుకు పోలీసులు సమయానుకూలంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. సమావేశంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లోని పోలీసు సిబ్బంది తో పాటు ప్రాసిక్యూషన్ తరపున డిప్యూటీ డైరెక్టర్ కస్తూరి , జాయింట్ డైరెక్టర్ రాజి రెడ్డి, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పాల్గొన్నారు.
పహాడీషరీఫ్ ఇన్‌స్పెక్టర్ కిరణ్‌పై వేటు
సాక్షి, సిటీబ్యూరో: పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) కిరణ్ కుమార్‌పై రాచకొండ పోలీసు కమిషనర్ డీఎస్ చౌహాన్ వేటు వేశారు. అతడిని సీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో అదే స్టేషన్‌లో డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఎం. కాశీ విశ్వనాథ్‌ను తాత్కాలిక ఎస్‌హెచ్‌ఓగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. కాగా ఇప్పటివరకు ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన కిరణ్ కుమార్ మహేశ్వరం మండలం, తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని ఓ భూ తగాదాలో తలదూర్చినట్లు సీపీ దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఆయనను బదిలీ చేసినట్లు తెలుస్తోంది. గత ఏడాది అక్టోబర్‌లో ఎస్‌హెచ్‌ఓగా బాధ్యతలు చేపట్టిన కిరణ్ కొద్ది నెలల్లోనే బదిలీ కావడం గమనార్హం.
● సీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు
● భూ తగాదాల్లో తలదూర్చడమే కారణం
● తాత్కాలిక ఎస్‌హెచ్‌ఓగా డీఐ కాశీ విశ్వనాథ్