జనగామ : తెలంగాణ రాష్ట్రంలో గుండె జబ్బులు, స్ట్రోక్ అత్యవసర కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్కరు స్వీయ రక్షణను జీవన శైలిలో భాగం చేసుకోవాలి. అప్పుడే ఆరోగ్యం భద్రంగా ఉంటుంది. అత్యవసర సమయంలో 108 సేవలను వినియోగించుకుని ఆరోగ్యం కాపాడుకోవాలి. వైద్యులు, ఆస్పత్రులపై పూర్తిగా ఆధారపడకుండా వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యత. ఈ క్రమంలో జూలై 24న అంతర్జాతీయ స్వీయ సంరక్షణ దినోత్సవం. ఈ సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
30 నుంచి 40 ఏళ్ల వయస్సు వారిలో
పెరుగుతున్న గుండె సంబంధిత వ్యాధులు..
108 ఈఎంఆర్‌ఐ అత్యవసర సేవల గణాంకాల ప్రకారం 2026 జనవరి నుంచి జూన్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 17,940 ఛాతి నొప్పి కేసులు, 5,025 స్ట్రోక్ అత్యవసర కేసులు నమోదవడం ఆందోళన కలిగించే అంశమని రాష్ట్ర 108 అంబులెన్స్ సేవల కార్యనిర్వాహక అధికారి బి.సుధాకర్ వెల్లడించారు. ముఖ్యంగా 30 నుంచి 40 ఏళ్ల వయస్సు వారిలో గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతుండగా, యువత కూడా గుండె జబ్బుల బారిన పడుతున్నట్లు తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్లడ్ ప్రెషర్, రక్తంలో చక్కెర స్థాయి, లిపిడ్ ప్రొఫైల్ వంటి పరీక్షలను క్రమం తప్పకుండా చేయించుకోవడం, సమతుల ఆహారం తీసుకోవడం, రోజూ వ్యాయామం చేయడం, పొగాకు, మద్యానికి దూరంగా ఉండడం, మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం వంటి అలవాట్లు ఆరోగ్య రక్షణకు అత్యంత అవసరమని సూచిస్తున్నారు. హార్ట్ అనే ఐదు దశల స్వీయ సంరక్షణ ప్రణాళికను కూడా ప్రజలు పాటించాలని తెలిపారు.
ప్రాణ రక్షణకు ముందస్తు జాగ్రత్తలే ముఖ్యం
అధిక రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రా ల్, ఒత్తిడితో కూడిన జీవనశైలి స్ట్రోక్, గుండె జబ్బులకు ప్రధాన కారణాలుగా మారుతున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలే ప్రాణాలను కాపాడగలవని వైద్య నిపుణులు చెబుతున్నారు. శారీరక, మానసిక, సామాజిక ఆరోగ్యంపై సమాన శ్రద్ధతో పాటు డిజిటల్ డిటాక్స్ కూడా అవసరమని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ఆలస్యం చేయకుండా 108 అంబులెన్స్ సేవలకు వెంటనే కాల్ చేయడం కూడా స్వీయ సంరక్షణలో భాగమే కాకుండా సామాజిక బాధ్యత అని సుధాకర్ స్పష్టం చేశారు. ప్రజల్లో స్వీయ సంరక్షణపై అవగాహన పెరిగితే గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక సమస్యలను గణనీయంగా తగ్గించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
ఉమ్మడి జిల్లాలో
108 అంబులెన్స్‌లు
జిల్లా అంబులెన్స్‌ల సంఖ్య
జనగామ 12
వరంగల్ 15
హనుమకొండ 16
జేఎస్ భూపాలపల్లి 11
మహబూబాబాద్ 15
ములుగు 14
అప్రమత్తతతోనే ఆరోగ్య భద్రత
అత్యవసరంలో 108కు కాల్ చేయడం కీలకం
పెరుగుతున్న గుండె జబ్బులు, స్ట్రోక్ కేసులు
నేడు స్వీయ సంరక్షణ దినోత్సవం


