కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి ఉన్నత విద్యాశాఖాధికారుల, పలువురి వీసీల బృందంతో కలిసి ఇటీవల జర్మనీలో పర్యటించిన విషయం విధితమే. అక్కడి రెట్లిన్‌జెన్ యూనివర్సిటీలో కూడా పర్యటించారు. ఈ సందర్భంగా సమర్పించిన లెటర్ ఆఫ్ ఇంటెంట్‌కు కొనసాగింపుగా ఆ జర్మనీ యూనివర్సిటీ బృందం గురువారం తెలంగాణను సందర్శించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల ప్రతినిధులతో ముందుస్తుగా హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ ప్రతినిధి బృందంతో విద్య, పరిశోధన, అధ్యాపకుల, విద్యార్థుల పరస్పర మార్పిడి కార్యక్రమాలపై అభిప్రాయాలు పంచుకున్నట్లు వీసీ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. ముఖ్యంగా కేయూలోని ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు 3ప్లస్2 విధానంలో మూడు సంవత్సరాలు, కేయూలో బీటెక్ విద్యనభ్యసించి అనంతరం రెండు సంవత్సరాలు జర్మనీలోని ఆ యూనివర్సిటీలో మాస్టర్స్ పూర్తిచేసేలా అవకాశాలపై చర్చించినట్లు తెలిపారు. వీసీ వెంట కేయూ ఓఎస్‌డీ బి. వెంకట్రామ్‌రెడ్డి, యూసీసీ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ ఆర్. మల్లికార్జున్‌రెడ్డి, కోఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఎన్. రమణ, మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ కె. భిక్షాలు పాల్గొన్నారు.


