హన్మకొండ : రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులు బుధవారం నిర్వహించ తలపెట్టిన ‘ఛలో మింట్ కాంపౌండ్’ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాద్‌లోని ఎస్పీడీసిఎల్ కంపెనీ కార్యాలయం ఎదుట చేపట్టనున్న ధర్నాకు వెళ్లకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలువురు ఆర్టిజన్ కార్మికులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుని నిర్బంధించారు. ఆర్టిజన్ కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం.. గత ఏప్రిల్‌లో కార్మికులు 10 రోజుల పాటు నిరవధిక సమ్మె నిర్వహించిన అనంతరం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో జరిగిన చర్చల్లో కార్మికుల ప్రధాన సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. హామీ ఇచ్చి మూడు నెలలు గడిచినా ఎలాంటి పురోగతి కనిపించలేదని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం దృష్టికి మరోసారి తమ సమస్యలను తీసుకెళ్లేందుకు ఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నాకు తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ జేఏసీ పిలుపునిచ్చిందన్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న ఆర్టిజన్ కార్మికులను ఇళ్ల నుంచి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలో జరిగిన ఘటనకు అధికారంలో ఉండి నిరసనలు తెలుపుతున్న కాంగ్రెస్.. తమ హక్కుల సాధనకు పోరాడుతున్న ఆర్టిజన్ కార్మికులను అరెస్టు చేయడం విడ్డూరంగా ఉందని ఆయా సంఘాల నాయకులు విమర్శించారు.


