హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
హన్మకొండ అర్బన్: భూ రీ–సర్వే కార్యక్రమాన్ని పారదర్శకంగా, వేగవంతంగా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, రెవెన్యూ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ.. మొదటి దశలో ధర్మసాగర్ మండలం జానకీపురం, ముచ్చర్లలో జరుగుతున్న రీ–సర్వేను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని, రెండో దశలో ఎంపిక చేసిన 71 గ్రామాల్లో కూడా పనులు వేగవంతం చేయాలని సూచించారు. పరకాల మండలం రాజుపేట, ఐనవోలు మండలం పంథిని, భీమదేవరపల్లి, నడికూడ మండలం సర్వాపూర్, కాజీపేట మండలం అమ్మవారిపేట గ్రామాల్లో రీ–సర్వే కొనసాగుతోందని తెలిపారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అదనపు కలెక్టర్ ఎన్.రవి మాట్లాడుతూ, తహసీల్దార్లు ప్రణాళికాబద్ధంగా పనిచేసి ప్రభుత్వ లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలన్నారు. సమావేశంలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ నూర్ సింగ్, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు వెంకటేశ్, వెంకన్న, తహసీల్దార్లు, సర్వేయర్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
నాణ్యమైన వైద్య సేవలందించి విశ్వాసం పెంచాలి..
నయీంనగర్: ప్రభుత్వాస్పత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలందిస్తూ ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాలని, అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పోచమ్మకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్‌వాడీ కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. యూపీహెచ్‌సీలో అందిస్తున్న వైద్య సేవలు, ప్రాథమిక పరీక్షల గురించి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎన్.దీప్తిని అడిగి రికార్డులు పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మదన్‌మోహన్ రావు, వైద్య సిబ్బంది, ఐసీడీఎస్ సిబ్బంది, సంబందిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


