పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్
హసన్‌పర్తి: మూగ జీవాలను అక్రమంగా తరలిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ హెచ్చరించారు. మూగ జీవాల అక్రమ రవాణాకు సంబంధించిన నిబంధనలు, చట్టపరమైన అంశాలపై వరంగల్ కమిషనరేట్ పరిధి గో రక్షణ కమిటీలతో మంగళవారం సమావేశం నిర్వహించారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన ఈ సమావేశంలో మూగజీవాల అక్రమ రవాణా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. గోవుల అక్రమ రవాణా సమాచారం ఉంటే తక్షణమే పోలీసులకు విషయాన్ని అందించాలని సూచించారు. గోవులను రక్షించాలనే క్రమంలో రక్షణ కమిటీ సభ్యులు చట్టాలను అతిక్రమించొద్దన్నారు. అక్రమంగా తరలిస్తున్న వాహనాలను వెంబడిస్తూ వేగంగా వాహనాలను నడపడం చాలా ప్రమాదకరమని సూచించారు. మూగజీవాలను అడ్డుకునే క్రమంలో నిందితులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని సూచించారు. సమావేశంలో డీసీపీలు అంకిత్‌కుమార్, రాజమహేంద్రనాయక్, దార కమిత, ట్రెయినీ ఐపీఎస్ మనీష, నేహ్రా, ఏసీపీలు జీతేందర్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, భీం శర్మ, సతీశ్‌బాబు, రవీందర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు, సబ్ ఇన్‌స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.


