మాది రైతు పక్షపాతి ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

మాది రైతు పక్షపాతి ప్రభుత్వం

May 6 2026 7:37 AM | Updated on May 6 2026 7:37 AM

మాది రైతు పక్షపాతి ప్రభుత్వం

– వివరాలు 8లోu

సీడ్‌ ప్లాంటర్‌, మేజ్‌ కలెక్టర్‌..

హన్మకొండ: రైతును రాజును చేయడమే కాంగ్రెస్‌ ప్రజాప్రభుత్వ లక్ష్యమని, మాది రైతుపక్షపాతి సర్కార్‌ అని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో మూడు రోజులపాటు జరిగే రాష్ట్రస్థాయి మెగా రైతుమేళాను బుధవారం మంత్రులు కొండా సురేఖ, ధనసరి సీతక్క, ఎంపీ కావ్య, ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి పొంగులేటి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ప్రగతి ప్రణాళికలో భాగంగా 99రోజులు అధికారులను ప్రజల ముంగిటికి పంపిస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే రైతు ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. 2022లో అద్భుతమైన రైతు డిక్లరేషన్‌ సభ నిర్వహించి ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత వెరవేరుస్తామని చెప్పి, సీఎం రేవంత్‌ నాయకత్వంలో రైతు పక్షపాతి ప్రభుత్వం ఏర్పాటు కాగానే అమలు చేస్తున్నామన్నారు. మన్మోహన్‌ సింగ్‌ ప్రధాన మంత్రిగా, రాష్ట్రంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదటిసారి రుణమాఫీ చేసింది కాంగ్రెస్‌ ప్రభుత్వమని గుర్తు చేశారు. రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వం కొంటుందన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులు అధికారం పోయిందని కడుపునిండా విషం నింపుకుని మాట్లాడుతున్నారన్నారు. కల్లాల వద్దకు వెళ్లి సినిమాలో ఫోజులు ఇచ్చినట్లు ఇచ్చి పత్రికల్లో ఫొటోలు వేయించుకుంటున్నారన్నారు. ఎన్ని మీటింగ్‌లు పెట్టుకున్నా, నాలుగు సార్లు ముక్కు నేలకు రాసినా రైతులు పట్టించుకోరన్నారు.

ఓర్వలేక బీఆర్‌ఎస్‌, బీజేపీ విమర్శలు..

రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి అన్ని వర్గాలకు న్యాయం చేస్తుంటే బీఆర్‌ఎస్‌, బీజేపీ ఓర్వలేక విమర్శలు చేస్తున్నాయని అన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్‌ను గెలిపించాలని, సీఎం రేవంత్‌కు అండగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్‌ఎస్‌ హామీలు నెరవేర్చకుండా ఇప్పుడు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా బీఆర్‌ఎస్‌ నాయకులు కళ్లుండి చూడలేని, చెవులు ఉండి వినలేని దద్దమ్మలని అన్నారు.

ధాన్యం కొనుగోళ్లకు ఇబ్బంది పెడుతున్న కేంద్రం

రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేయాలని చూస్తుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొర్రీలు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. గత ప్రభుత్వం తడిసిన ధాన్యం కొనలేదని, తాము అన్నీ కొంటున్నామన్నారు. ఈ సందర్భంగా భూసార పరీక్షలు నిర్వహించుకున్న ఐదుగురు రైతులకు మంత్రుల చేతులమీదుగా పత్రాలు అందజేశారు. వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కేఆర్‌.నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, మేయర్‌ గుండు సుధారాణి, కుడా చైర్మన్‌ ఇనగాల వెంకట్రాంరెడ్డి, ఉద్యాన శాఖ డైరెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా, హనుమకొండ, వరంగల్‌ జిల్లాల కలెక్టర్లు చాహత్‌ బాజ్‌పాయ్‌, డాక్టర్‌ సత్యశారద పాల్గొన్నారు.

రైతును రాజును చేయడమే లక్ష్యం

ప్రభుత్వం పోయిందని కడుపునిండా విషం నింపేసుకున్న బీఆర్‌ఎస్‌

రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ,

పౌర సంబంధాల శాఖ మంత్రి

పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి

హనుమకొండలో రాష్ట్రస్థాయి

మెగా రైతుమేళా ప్రారంభం

వివిధ రకాల వ్యవసాయ ఉత్పత్తులు, యంత్ర పరికరాలతో ఆకట్టుకున్న స్టాళ్లు

సందర్శించి వివరాలు తెలుసుకున్న

అన్నదాతలు

Advertisement
 
Advertisement
Advertisement