ఇటు కుడాకు.. అటు రైతుకు లాభం
సాక్షి, వరంగల్:
కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) రియాల్టీ బిజినెస్ వైపు వేగంగా అడుగులు వేస్తోంది. తమకు కావాల్సిన ఆదాయాన్ని రాబట్టుకుంటూనే, భూములిచ్చే రైతులను రారాజుగా చేసే విధానాన్ని అలవాటు చేస్తోంది. గతంలో భూముల కొనుగోలు, లేదా కుడాకు సంబంధించిన భూముల్లో లేఅవుట్లు చేసి ప్లాట్ల విక్రయం ద్వారా ఆదాయం ఆర్జించింది. ఉనికిచర్లలో ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో రైతుల నుంచి 140 ఎకరాలు సేకరించి మహా లేఅవుట్ చేయడం ద్వారా భూమిచ్చిన రైతులకు భారీగా లబ్ధి చేకూరింది. ఈ క్రమంలోనే కుడా పరిధిలోని ఇతర రైతులూ ల్యాండ్ పూలింగ్‌కు సై అంటున్నారు. ఆత్మకూరు, చింతగట్టు, ఎల్కతుర్తి, చింతలపల్లి గ్రామ రైతులు తమ భూములు కుడాకు ఇవ్వాలనే అంగీకారానికి వచ్చారు. అధికారికంగా అంగీకార పత్రం ఇచ్చి నోటిఫికేషన్ వచ్చిన ఆత్మకూరులోని 30 ఎకరాల్లో లేఅవుట్ పనులు ఇప్పుడే మొదలయ్యాయి. తొలుత రోడ్లు, డ్రెయినేజీలు, విద్యుత్ స్తంభాలు వేసి ఆ తర్వాత ప్లాట్ల విక్రయంతో అక్కడి అవసరాలకనుగుణంగా మౌలిక వసతులు కల్పించనున్నారు.
నగరాభివృద్ధిలోనూ భూములిచ్చే
రైతుల పరోక్ష పాత్ర..
కుడా ఆధ్వర్యంలో రూ.70 కోట్లతో వరంగల్ మోడ్రన్ బస్టాండ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం అవసరమయ్యే భూసేకరణకు కుడానే రూ.200 కోట్ల వరకు చెల్లించింది. ఖమ్మం రోడ్డు నుంచి ఏనుమాముల వరకు రూ.80 కోట్లతో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. భద్రకాళి మాడ వీధులకు రూ.30 కోట్లు అవసరమవుతుండగా, ప్రభుత్వం రూ.20 కోట్లు ఇస్తుండగా, మరో రూ.10 కోట్లు కుడానే భరిస్తోంది. ఇలా నగరాభివృద్ధికి అవసరమయ్యే ప్రాజెక్టుల్లో కుడాను భాగస్వామ్యం చేస్తుండడంతో ఆ డబ్బులను ఇలా లేఅవుట్ల ద్వారా వచ్చే ఆదాయంతో ఖర్చు పెడుతోంది. ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో కుడాకు భూములిచ్చే రైతులు తాము ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు పరోక్షంగా నగరాభివృద్ధికి తమ సహకారాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే ఉనికిచర్లలో అభివృద్ధి చేసిన 140 ఎకరాల్లోని 250 ప్లాట్లలో 50 ప్లాట్లు వేలం పాట ద్వారా విక్రయిస్తే దాదాపు రూ.10 కోట్ల ఆదాయం వచ్చింది. అంతకుముందు 120 ఎకరాల్లోని ఓసిటీ, 100 ఎకరాల్లోని హసన్‌పర్తి మండలం మడిపల్లి మాసిటీలోని ప్లాట్ల విక్రయం ద్వారా దాదాపు రూ.200 కోట్ల ఆదాయం కుడాకు సమకూరింది. వీటితోనే వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు.
కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ల్యాండ్ పూలింగ్ రైతులను ఒప్పించి 50:50 పద్ధతిలో ప్లాట్ల కేటాయింపు
ఉనికిచర్ల లేఅవుట్ సక్సెస్‌తో ముందుకొస్తున్న రైతులు
ఆత్మకూరులో 30 ఎకరాల్లో ఇప్పటికే మొదలైన పనులు
చింతగట్టు, ఎల్కతుర్తి, చింతలపల్లిలోనూ 155 ఎకరాలు
వీటి విక్రయం ద్వారా రూ.కోట్ల ఆదాయం వస్తుందని అంచనా
అభివృద్ధి పనుల కోసమే నిధుల సేకరణ
ఈ నాలుగు ప్రాంతాల్లోని చింతగట్టులో గజం రూ.15వేలు, ఆత్మకూరు, ఎల్కతుర్తిలో రూ.8వేలు, చింతలపల్లిలో గజం రూ.8వేల నుంచి రూ.10వేల వరకు ధర పలకొచ్చని ‘కుడా’ అధికారులు భావిస్తున్నారు. ఈ లే అవుట్లలో 50:50 (కుడా, రైతులకు సగం సగం) పద్ధతిలో ప్లాట్ల కేటాయింపు చేయనున్నారు. ఈ ప్లాట్ల విక్రయించడం ద్వారా సుమారు రూ.200 కోట్లకుపైగా ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇదే తరహాలో రైతులు ఎకరం అమ్ముకుంటే వచ్చే డబ్బుల కంటే రెండింతల నగదు రావడంతో భారీగా లాభం పొందే అవకాశం ఉంది. వారికివచ్చిన ప్లాట్లను విక్రయించుకునే సౌలభ్యం ఉండడం కలిసిరానుంది. రోడ్లు, డ్రెయినేజీ, విద్యుత్ స్తంభాలు, ఇతర మౌలిక వసతుల కోసం ‘కుడా’నే నిధులు వెచ్చించనుంది. దీంతో రైతుకు రూపాయి ఖర్చు లేకుండానే భారీ ఆదాయం రానుంది.
ల్యాండ్ పూలింగ్‌లో ఎవరికి ఎంత అంటే.. (ప్లాట్ల విస్తీర్ణం గజాల్లో)
గ్రామం ఎకరాలు ప్లాట్ల విస్తీర్ణం రైతులకు కుడాకు
ఆత్మకూరు 30 84,000 42,000 42,000
చింతగట్టు 25 70,000 35,000 35,000
ఎల్కతుర్తి 80 2,24,000 1,12,000 1,12,000
చింతలపల్లి 50 1,40,000 70,000 70,000


