రోగులకు ఇబ్బంది కలగొద్దు | - | Sakshi
Sakshi News home page

రోగులకు ఇబ్బంది కలగొద్దు

Feb 24 2026 9:04 AM | Updated on Feb 24 2026 9:04 AM

రోగులకు ఇబ్బంది కలగొద్దు

రోగులకు ఇబ్బంది కలగొద్దు

డీఎంహెచ్‌ఓ అప్పయ్య

ఎంజీఎం: ఆస్పత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా వారితో మర్యాదగా ప్రవర్తిస్తూ అవసరమైన వైద్య సేవలు అందించాలని హనుమకొండ జిల్లా వైద్యాధికారి అప్పయ్య వైద్యాధికారులు, వైద్య సిబ్బందికి సూచించారు. సోమవారం ఆయన హసన్‌పర్తి ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి ఆస్పత్రిలోని హాజరు పట్టికతో పాటు రోగులకు అందిస్తున్న సేవలకు సంబంధించిన రిజిస్టర్లను తనిఖీ చేశారు. అనంతరం నక్కలగుట్టలోని వీఆర్స్‌ హెయిర్‌ క్రియేషన్స్‌పై వచ్చిన కంప్‌లైంట్‌ ఆధారంగా తనిఖీ నిర్వహించారు. కంప్‌లైంట్‌కు సంబంధించి వివరణ అడగగా.. ప్రొసీజర్స్‌ చేసే ముందు అవసరమైన పరీక్షలు చేసుకుని రమ్మని కోరగా.. సదరు వ్యక్తి దురుసుగా ప్రవర్తించినందున అతడికి చికిత్స చేయడానికి నిరాకరించినట్లు డాక్టర్‌ నవ్య డీఎంహెచ్‌ఓ వివరించారు. డాక్టర్‌ ఇచ్చిన వివరణ సంతృప్తిగా లేకపోవడం, ప్రొవిజనల్‌ రిజిస్ట్రేషన్‌ గడువు ముగిసినందున షోకాజ్‌ నోటీస్‌ జారీ చేసినట్లు డీఎంహెచ్‌ఓ అప్పయ్య వివరించారు. అనంతరం నక్కలగుట్టలోని కిడ్స్‌ కేర్‌ హాస్పిటల్‌ను సందర్శించి ప్రదర్శించిన వివిధ అనుమతి పత్రాలను, రిపోర్టులను పరిశీలించారు. టారీఫ్‌లకు సంబంధించిన బోర్డు చిన్నగా ఉన్నందున, అందరికీ కనిపించేలా సూచించిన సైజులో ప్రదర్శించాలన్నారు.

ఆసక్తికరంగా శతావధానం

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీలో స్వర్ణోత్సవాల సందర్భంగా తెలుగు విభాగం, కాకతీయ పద్య కవితా వేదిక ఆధ్వర్యంలో కేయూలోని సెనేట్‌హాల్‌లో చేపట్టిన అవధాన ప్రియ చేపూరిశ్రీరాం శతావధానం రెండో రోజు సోమవారం ఆసక్తికరంగా కొనసాగింది. కాకతీయ పద్య కవితా వేదిక అధ్యక్షుడు కందిశంకరయ్య సంచాలకత్వంలో అవధాని చతురతతో సమర్థవంతంగా 25 సమస్యా పూరణలు, 25 దత్త పదులను, 25 వర్ణణలను రెండు అవృత్తాలను పూర్తి చేశారు. మధ్యలో 25 ఆశువులను కూడా నిర్వహించారు. పృచ్ఛకులు అడిగిన వివిధ అంశాలపై సమస్యలపై పద్యరూపంలో పూరణలు చేశారు. దుష్కర ప్రాసలను, అసందర్భ సమస్యలను దత్తపదులను అలవోకగా అవధాని చేపూరిశ్రీరాం పూరణ చేశారు. కార్యక్రమంలో కేయూ పాలకమండలి సభ్యుడు డాక్టర్‌ చిర్రరాజు తెలుగు విభాగం అధిపతి డాక్టర్‌ మామిడి లింగయ్య, అధ్యాపకుడు డాక్టర్‌ కర్రె సదాశివ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement