మందగించిందా..!?
‘గ్రేటర్’లో సీసీ రోడ్లు వేసిన ఏడాదిలోపే తవ్వకాలు
వరంగల్ అర్బన్ : ప్రజల సొమ్మంటే గ్రేటర్ వరంగల్‌లో లెక్క లేకుండా పోతోంది. వివిధ పన్నుల రూపేణా మహానగర ప్రజలు చెల్లిస్తున్న ప్రజాధనం అశాసీ్త్రయమైన నిర్ణయాలతో దుర్వినియోగమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందుకు ఉదాహరణ నగరం నడిబొడ్డున వరంగల్ కాశిబుగ్గ వివేకానంద కాలేజీనుంచి కూరగాయల మార్కెట్ వరకు వెళ్లే రోడ్డు పనులే. ఈ రోడ్డును ఏడాది కిందట రూ.40 లక్షలతో నిర్మించారు. పైప్‌లైన్ లీకేజీతో తాగునీరు వృథాగా పోతుండడంతో రోడ్డు దెబ్బతింది. దీంతో తాజాగా రోడ్డు తవ్వకాలు చేసి, ౖపైప్‌లైన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడే కాదు. అన్ని డివిజన్లలో ఇదే తరహాలో ఇంజనీర్లు పనులు చేపడుతుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇష్టారాజ్యంగా తవ్వకాలతో రోడ్లు ధ్వంసం
ఏదైనా సీసీరోడ్డు, డ్రెయినేజీ నిర్మించే ముందు ఆయా కాలనీల్లో తాగునీటి పైప్‌లైన్లు నాణ్యత, లీకేజీలను పరిగణనలోకి తీసుకోవాలి. లీకేజీలు ఉంటే ముందుగా సరిచేయాలి. కానీ, బల్దియా ఇంజనీర్లు ఆవేమీ పట్టించుకోవట్లేదు. వివిధ కాలనీల్లో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించగానే కార్పొరేటర్ల ఒత్తిళ్లతో ముందు చూపులేకుండా గ్రేటర్ ఇంజనీర్లు రోడ్డు పనులు చేపడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అభివృద్ధి పనులు చేపట్టడం తదుపరి పైప్‌లెన్లు, కేబుళ్ల పేరుతో ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేస్తూ రూపురేఖలను మార్చేస్తున్నారు. దీంతో ఏర్పడిన గుంతలతో వాహనాల రాకపోకలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. వాహనాదారులు నడుములు హూనమవుతున్నాయి. ప్రమాదాల బారిన పడి ఆస్పత్రుల పాలవుతున్నారు. ఈ సమస్యలను బల్దియా ఇంజనీర్లు, కార్పొరేటర్లు ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఎందుకింత నిర్లక్ష్యం?
ఆయా డివిజన్లలో ఎక్కడెక్కడ అభివృద్ధి పనులు చేపడతారనే విషయం రెండు విభాగాల ఇంజనీర్లకు తెలిసి ఉండాలి. ఆ పనులను పక్కా ప్రణాళికతో చేపట్టాలి. ముందుగా ఆ ప్రాంతంలో తాగునీటి లీకేజీలు, నాణ్యతా ప్రమాణాలు గుర్తించాలి. ఒకవేళ లీకేజీలు తరచూ ఉత్పన్నమైతే ముందుగా పైప్‌లైన్ వేయాలి. తదుపరి సీసీ రోడ్డు, ఆ తర్వాత డ్రెయినేజీని నిబంధనలకు మేరకు నిర్మించాలి. కానీ, రూల్స్‌ను ఇంజనీర్లు అతిక్రమిస్తూ ప్రజాధనం నేలపాలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. కమీషన్ల కోసం ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్నారనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఇంజనీర్లు, పాలకవర్గ సభ్యులు మాత్రం లీకేజీల వల్ల తాగునీటి సమస్య ఎదురవుతుండడంతో రోడ్లతవ్వకాలు చేసి కొత్త పైప్‌లైన్లు నిర్మిస్తున్నారని పేర్కొంటున్నారు.
తాగునీటి పైప్‌లైన్ల లీకేజీలు
సరిచేసేందుకేనని సమర్థన
కమీషన్ల కోసమే అన్న అనుమానాలు
వృథా అవుతున్న ప్రజాధనం
కార్పొరేటర్ల ఒత్తిడే
కారణమంటున్న ఇంజనీర్లు


