
అర్హుల ఎంపిక త్వరగా పూర్తి చేయండి
హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య
హన్మకొండ అర్బన్: జిల్లాలో రాజీవ్ యువ వికాసంపథకం అర్హుల ఎంపిక ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధి కారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఆర్‌వైవీ, ఉపాధి హామీ పథకాలపై ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. అర్హుల ఎంపికలో భాగంగా దరఖాస్తుల పరిశీలన త్వరగా పూర్తి చేయాలని, జిల్లాలో మొత్తం 10,565 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. మే 24 వరకు మండల స్థాయి కమిటీలతో ఎంపిక పూర్తి చేసి తుది జాబితా అందించాలన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా 7,675 పని దినాలకు ఇప్పటి వరకు 3,645 పని దినాలు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. రుతుపవనాలు ముందే వచ్చే అవకాశం ఉన్నందున జూన్ 15 నాటికి లక్ష్యాన్ని అధిగమించి పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, డీఆర్డీఓ పీడీ మేన శ్రీను, హౌసింగ్ డీడీ రవీందర్, డీపీఓ లక్ష్మీ రమాకాంత్, ఎల్‌డీఎం శ్రీనివాస్, ఎస్పీ కార్పొరేషన్ ఈడీ బాలరాజు పాల్గొన్నారు.
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి..
జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో చేపట్టిన పలు అభివృద్ధి పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో అంగన్‌వాడీల్లో చేపట్టిన పనుల పురోగతి, ఇతర అంశాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఉపాధి హామీ పథకం ద్వారా 24 అంగన్‌వాడీల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో డీడబ్ల్యూఓ జయంతి, సీపీఓ సత్యనారాయణరెడ్డి, పీఆర్ ఈఈ ఆత్మరావు ఉన్నారు.