
స్కానింగ్ సెంటర్లపై దృష్టి సారించాలి
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: లింగ నిర్ధారణ పరీక్షలు చేసే స్కానింగ్ సెంటర్లపై దృష్టి సారించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన సమీక్షలో ఆమె మాట్లాడారు. లింగనిర్ధారణ పరీక్షలు చేయకుండా కమిటీ సభ్యులు తరచూ తనిఖీలు నిర్వహించాలని సూచించారు. వీటిపై కళాబృందాలతో కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. జిల్లా కోర్టు చీఫ్ ఏఓ కోట్ల రాధాదేవి, డీసీపీ అంకిత్‌కుమార్ సంకాల్వే, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, వరంగల్ ఏసీపీ నందిరాంనాయక్, మామునూరు ఏసీపీ తిరుపతి, నర్సంపేట ఏసీపీ రవీందర్‌రెడ్డి, పీపీ సంతోషి, ప్రోగ్రాం ఆఫీసర్ ఆచార్య, డిప్యూటీ డెమో అనిల్‌కుమార్, సీఐ వెంకన్న, ఎన్జీఓ ప్రతినిధి పరశురాములు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి అధికారులు సిద్ధం
సమస్యల పరిష్కారానికి పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు సిద్ధంగా ఉన్నారని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ విజిలెన్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ అట్రా సిటి, అత్యాచార కేసుల పరిహారం చెల్లింపు, ఇతర సమస్యలపై కలెక్టర్ సమీక్షించారు.
రక్తనిధి కేంద్రం నిర్మాణానికి హామీ
గవర్నర్ ప్రధాన కార్యదర్శి దానకిశోర్ ఆదేశాల మేరకు జిల్లాలో ఇండియన్ రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంకు (రక్తనిధి) నిర్మాణానికి ప్రభుత్వ స్థలాన్ని కేటాయించేందుకు చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హామీ ఇచ్చారు. కలెక్టరేట్‌లో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యత్వం, సొసైటీ ఎన్నికల నిర్వహణ, రక్తనిధి కేంద్రం నిర్మాణ అంశాలపై సమగ్రంగా చర్చించారు.