
త్రివేణి సంగమం.. భక్తజన సంద్రం
● సరస్వతీ నది పుష్కరాలకు పోటెత్తిన భక్తజనం
● ఐదో రోజు 80వేల మంది పుణ్యస్నానాలు
భూపాలపల్లి/కాళేశ్వరం: సరస్వతీ నది పుష్కరాలకు సోమవారం ఐదోరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి నదీమాతకు పూజలు చేశారు. చీరె, సారె సమర్పించారు. ముత్తయిదువలు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. పిండ ప్రదానాలు, పితృదేవతలకు తర్పణాలు నిర్వహించారు. భక్తులతో పుష్కరిణి నిండిపోయింది. పుష్కర స్నానాలు ఆచరించిన అనంతరం భక్తులు కాళేశ్వర ముక్తీశ్వరస్వామిని దర్శించుకున్నారు.
తగ్గిన రద్దీ
పుష్కరాలకు భక్తుల రద్దీ తగ్గింది. హైదరాబాద్, వరంగల్, భూపాలపల్లి.. మంథని, కాటారం మీదుగా.. అలాగే మంచిర్యాల, గోదావరిఖని, చెన్నూర్, ఆసిఫాబాద్, నిర్మల్ నుంచి భక్తులు వాహనాల్లో తరలివచ్చారు. ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు డివైడర్లు ఏర్పాటు చేసి నియంత్రించారు. పార్కింగ్ స్థలాల్లో వాహనాల రద్దీ కొనసాగింది. శని, ఆదివా రాల్లో రెండేసి లక్షల చొప్పున భక్తులు రాగా.. సోమవారం 80వేల మంది పుణ్యస్నానాలు ఆచరించిన ట్లు అధికారులు అంచనా వేశారు.
నదీహారతికి రద్దీ
సరస్వతీ ఘాట్‌లో కాశీపండితులచే ఏర్పాటు చేసిన నవరత్నమాలిక హారతికి భక్తుల తాకిడి పెరుగుతోంది. ఏడు గద్దెలపై తొమ్మిది హారతులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విద్యుత్ వెలుగుల్లో హారతి ఇస్తున్నా రు. తిలకించేందుకు భక్తులు పోటీ పడ్డారు. సరస్వతీ అమ్మవారి విగ్రహం వద్ద భక్తులు దర్శించుకున్నాక జ్ఞానతీర్థం వద్ద ఫొటోలు, సెల్ఫీలు దిగారు.
నాసిక్ పీఠాధిపతి పూజలు
నాసిక్ త్రయంబకేశ్వర్ మహామండలేశ్వర్ ఆచార్య సంవిధానందా సరస్వతీ మహారాజ్ ముందుగా త్రివేణి సంగమంలోని అంతర్వాహిని సరస్వతీనది లో పుష్కర స్నానం.. విశేష పూజలు నిర్వహించా రు. అనంతరం రాజగోపురం వద్ద అర్చకులు, అధి కారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీకాళేశ్వరముక్తీశ్వరున్ని దర్శించుకుని పూజలు చేశారు.