
పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలి
● కేయూలో ఆందోళనకు దిగిన విద్యార్థులు
● నేటినుంచి పరీక్షలు యథాతథం : కేయూ రిజిస్ట్రార్, పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో ఈనెల 20 నుంచి పీజీ కోర్సుల (నాన్ ప్రొఫెషనల్ రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్‌మెంట్) విద్యార్థులకు నాల్గో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈమేరకు పరీక్షలు వాయిదా వేయాలని సోమవారం రాత్రి 9.30 నుంచి 11.30 గంటల వరకు క్యాంపస్‌లోని విద్యార్థులు కేయూ మొదటి గేట్ వద్ద ఆందోళన చేశారు. కేయూ పోలీస్టేషన్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్, ఎస్సైలు రవీందర్, శ్రీకాంత్ అక్కడికి చేరుకుని ఆందోళన విరమించాలని కోరారు. పరీక్షల వాయిదా విషయమై కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ రాజేందర్‌ను వివరణ కోరగా, ఈనెల 20నుంచి కేయూ పరిధిలో యధావిధిగా పీజీ కోర్సుల నాల్గో సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే ఒకసారి వాయిదా వేశామని, ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలోని విద్యార్థులు ఎవరూ వాయిదా వేయాలని కోరుకోవడం లేదన్నారు. సెమిస్టర్ పరీక్షలు యధావిధిగా ఉంటాయని కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం కూడా స్పష్టంచేశారు.