
ఆక్రమణలు.. అతిక్రమణలు
వరంగల్ అర్బన్: రోడ్లు, డ్రెయినేజీల ఆక్రమణలు, నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు లేని కట్టడాలపై బల్దియా గ్రీవెన్స్‌కు ఫిర్యాదులు సోమవారం వెల్లువలా వచ్చాయి. ఎన్నిసార్లు దరఖాస్తులు అందించినా క్షేత్ర స్థాయిలో పరిష్కారం లభించడం లేదని పలు కాలనీవాసులు బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాడకే దృష్టికి తీసుకొచ్చారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులను కమిషనర్ స్వీకరించారు. గ్రీవెన్స్‌కు మొత్తం 99 ఫిర్యాదులు రాగా, అందులో టౌన్ ప్లానింగ్ విభాగానికి 56 దరఖాస్తులు రావడం గమనార్హం. కనీస వసతుల కోసం ఇంజనీరింగ్ సెక్షన్‌కు 16, ప్రజారోగ్యానికి 14, పన్నుల విభాగానికి 7, తాగునీటి సరఫరాపై 6 ఫిర్యాదులు అందినట్లు అధికారులు వెల్లడించారు. ప్రజా సమస్యలపై దృష్టి సారించి వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను కమిషనర్ అశ్విని తానాజీ వాకడే ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ జోనా, సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి, డీఎఫ్‌ఓ శంకర్‌లింగం, ఇన్‌చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, హెచ్‌ఓలు రమేష్, లక్ష్మారెడ్డి, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్న రాణి, రాజేశ్వర్, ఎంహెచ్‌ఓ డాక్టర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
గ్రీవెన్స్‌కు వచ్చిన దరఖాస్తుల్లో కొన్ని..
● మడికొండలోని 646, 647 సర్వే నంబర్లలోని స్థలాన్ని డెవలపర్స్ తప్పుడు సర్వే నంబర్లతో కుంట కట్టను తొలగించి, ఎఫ్‌టీలో పాట్లు చేసి, తమ సొంత భూములకు కూడా కబ్జా చేస్తున్నారని బాధితులు వాపోయారు. కబ్జాదారులపై చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
● హంటర్ రోడ్డులో 196 ఇళ్లకు గత రెండేళ్లుగా పెంచిన ఆస్తి పన్నును తగ్గించాలని బాధిత ఇళ్ల యజమానులు కోరారు.
● 1వ డివిజన్ పెగడపల్లి ప్రభుత్వ స్కూల్‌కు వెళ్లే దారిలో డ్రెయినేజీ వ్యవస్థ లేక మురుగు నీరు రోడ్డుపైనే ప్రవహిస్తోందని స్థానికులు పేర్కొన్నారు.
● 57వ డివిజన్ అశోకా కాలనీలో మురుగు కాల్వ లు లేక చిన్నపాటి వర్షానికే వరద నీరు ఇళ్లల్లోకి వస్తోందని, ఈక్రమంలో డ్రెయినేజీతో పాటు కల్వర్ట్ నిర్మించాలని కాలనీవాసులు కోరారు.
● హనుమకొండ శ్రీనగర్ కాలనీలో ఇంటి నంబర్ 2 – 8 – 456 వద్ద డ్రెయినేజీ లేక రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని మణెమ్మ ఫిర్యాదు చేశారు.
● హనుమకొండ న్యూ బృందావన్ కాలనీలో కుక్కల బెడద విపరీతంగా ఉందని, ఈక్రమంలో అధికారులు చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు విన్నవించారు.
● మహాత్మాగాంధీ జ్యోతిరావు పూలే సొసైటీకి 2016 నుంచి 2025 వరకు రావాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని కాంట్రాక్టర్లు విజ్ఞప్తి చేశారు.
● భద్రకాళి గుడి రోడ్డులో ఓ ప్లాట్ యాజమాని రోడ్డును ఆక్రమించి నిర్మాణం చేస్తున్నాడని, ఈక్రమంలో అతడిపై చర్య తీసుకోవాలని స్థానికులు ఫిర్యాదు చేశారు.
● 2వ డివిజన్ పెగడపల్లిలో నాలుగేళ్ల క్రితం ఇళ్లను నిర్మించుకున్నామని, ఈక్రమంలో ఇంటి నంబర్లు కేటాయించాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు.
● మడికొండ హిల్స్ కాలనీలో కొంతమంది రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని, బాధ్యులపై చర్య తీసుకోవాలని కాలనీవాసులు కోరారు.
● హంటర్ రోడ్డులో ప్రతిపాదిత పార్కు స్థలాన్ని కబ్జా చేసేందుకు కొంతమంది యత్నిస్తున్నారని, ఈక్రమంలో ఆ స్థలాన్ని కాపాడాలని కాలనీవాసులు విన్నవించారు.
● ఒక్కో సెలూన్ షాపు ఏర్పాటుకు 250 మీటర్ల దూరం ఉండేలా అనుమతులు ఇవ్వాలని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకోవాలని నాయీ బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు.
వాటిపైనే వెల్లువలా ఫిర్యాదులు
కనీస వసతులు కల్పించాలని
ప్రజల విన్నపాలు
గ్రీవెన్ సెల్‌లో దరఖాస్తులు
స్వీకరించిన కమిషనర్