
పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలి
వరంగల్ కలెక్టర్ సత్యశారద
విద్యారణ్యపురి/న్యూశాయంపేట: ఈనెల 22 నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు, జూన్ 3 నుంచి జరగనున్న టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను వరంగల్ కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పరీక్షలు ఉదయం, మధ్యాహ్నం నిర్వహిస్తున్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో 16 ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో 5,200 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రెండు సిట్టింగ్ స్క్వాడ్లు, ఒక ప్లయింగ్ స్క్వాడ్, సీఎస్‌డీఓలను 16మంది చొప్పున నియమించారు. ఈ సమావేశంలో డీఐఈఓ శ్రీధర్‌సుమన్, డెక్ సభ్యులు మాధవరావు, విజయనిర్మల, జిల్లా విద్యాశాఖాధికారి మామిడి జ్ఞానేశ్వర్, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
భూములు కోల్పోయిన రైతుల ఆర్బిట్రేషన్ పూర్తి
న్యూశాయంపేట: గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే 163–జి నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతుల ఆర్బిట్రేషన్ పూర్తయ్యిందని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. హైవేలో భూములు కోల్పోయిన నెక్కొండ మండలం నెక్కొండ, పత్తిపాక, వెంకటాపూర్, ఆలంఖాన్‌పేట, చంద్రుగొండ, తోపనపల్లి, అప్పలరావుపేట, గ్రామాల రైతులతో సోమవారం కలక్టరేట్‌లో కలెక్టర్ ఆర్బిట్రేషన్ నిర్వహించారు. ఆర్డీఓ ఉమారాణి, నెక్కొండ తహసీల్దార్ రాజ్‌కుమార్, ఎన్‌హెచ్ హైవే టీం లీడర్ సంపత్‌కుమార్, పర్యవేక్షకులు శ్రీకాంత్ పాల్గొన్నారు.