
బయో గ్యాస్ ప్లాంట్‌కు చొరవ తీసుకోవాలి
వీసీలో పురపాలక శాఖ కమిషనర్,
డైరెక్టర్ శ్రీదేవి
వరంగల్ అర్బన్: వరంగల్ నగరంలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి ప్రత్యేక చొరవ తీసుకోవాలని రాష్ట్ర పురపాలక కమిషనర్ అండ్ డైరెక్టర్ శ్రీదేవి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, బల్దియా ప్రధాన కార్యాలయంలో కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ ప్లాంట్ నిర్మాణం కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. నగరంలో వెలువడే 20 టన్నుల ఆర్గానిక్ వ్యర్థాలను రీసైకిల్ చేసి కంప్రెస్ట్ బయో మిథైన్ గ్యాస్‌గా మార్చేందుకు వేస్ట్ – టు బయో మిథనైజేషన్ ప్లాంట్‌ను ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్లాంట్ ఏర్పాటు ద్వారా నగర పరిశుభ్రత మెరుగు పడుతుందని అన్నారు. ఈ ప్రాజెక్ట్ పబ్లిక్, ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ విధానంలో రూపకల్పన, నిర్మాణం, వితరణ, నిర్వహణ, బదలాయింపు, మోడల్ ఆధారంగా అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఉత్పత్తి అయ్యే బయోమైథెన్ గ్యాస్‌ను మార్కెట్‌లో విక్రయించడం ద్వారా ఆదాయం సమకూరుతుందని శ్రీదేవి అన్నారు. సమావేశంలో ఇన్‌చార్జ్ ఎస్‌ఈ శ్రీనివాస్, ఈఈలు రవికుమార్, మాధవి, సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.