
డైక్ కాంట్రాక్ట్ సిబ్బంది ఇష్టారాజ్యం
ఎంజీఎం: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ (డైక్)లో కాంట్రాక్ట్ సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కొద్ది నెలల నుంచి సిబ్బంది అసలు విధుల్లో లేకుండానే విధులకు హాజరైనట్లు అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకాలు చేస్తున్నారు. ఇంకా కొన్ని సందర్భాల్లో ఏకంగా విధులకు హాజరవ్వకుండా డైక్ సెంటర్‌కే తాళం వేసిన ఘటనలున్నట్లు బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. సిబ్బంది విధులకు డుమ్మా కొడుతుండడంతో బాధిత పిల్లలకు సేవలు ఎలా అందిస్తారంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డైక్ సెంటర్ కాంట్రాక్ట్ సిబ్బందిలో ఓ ఉద్యోగిని ఎవరైనా ప్రశ్నిస్తే.. ప్రముఖ దినపత్రిక చీఫ్ బ్యూరో నా చుట్టం.. మీరేం చేసుకుంటారో చేసుకోండి అంటూ.. చిందులు తొక్కుతుండడం గమనార్హం. ఎంజీఎం డైక్ సెంటర్‌లో అర్హత లేని వ్యక్తులు ఉద్యోగాలు పొందారని, నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగ నియామకాలు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. డైక్ సెంటర్ కాంట్రాక్టు సిబ్బంది తీరు, నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగ నియామకాలపై కలెక్టర్ విజిలెన్స్ అధికారులతో విచారణ జరిపించాలంటూ ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.