
శనివారం శ్రీ 17 శ్రీ మే శ్రీ 2025
– IIలోu
చలివేంద్రాల పేరుతో
స్వాహాకు యత్నం
● నిర్వహణ నిధులు పెరిగినా
ఎండుతున్న గొంతులు
● పట్టించుకోని గ్రేటర్ వరంగల్
మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీర్లు
వరంగల్ అర్బన్: పెరిగిన ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో మహానగర ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. వడగాలుల తాకిడితో అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని పలు రహదారుల్లో ప్రతి వేసవి మాదిరిగా ఈసారి కూడా బల్దియా ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. రద్దీ ప్రాంతాల్లో ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రయాణికులు, పాదచారుల దాహార్తి తీర్చాల్సి ఉంది. చలివేంద్రాల నిర్వహణ పేరిట రూ.22.50 లక్షల నిధులు కేటాయించారు. నీళ్లు సరఫరా చేయకుండానే నిధులు ఎలా మింగేయాలో కొంతమంది స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో ఇంజనీర్లు పర్యవేక్షించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.
66 డివిజన్లు.. 45 చలివేంద్రాలు
గ్రేటర్ పరిధిలోని 66 డివిజన్లలో 45 చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. కాశిబుగ్గ సర్కిల్ పరిధిలోని వరంగల్‌లో 24, కాజీపేట సర్కిల్‌లోని హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లో 21 చొప్పున చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏప్రిల్, మే, జూన్ నెలాఖరు వరకు అన్ని చలివేంద్రాల్లో చల్లటి నీరు సరఫరా చేయాలి. ఈ ఏడాది టెండర్ నిబంధనల్లో మార్పులు చేశారు. గతంలో కాంట్రాక్టర్ తాత్కాలిక తడకల షెడ్లు, రంజన్లు ఏర్పాటుకు పరిమితమయ్యేది. బల్దియా పారిశుద్ధ్య సిబ్బంది నీటి సరఫరా చేస్తుండేవారు. పనిభారం కారణంగా కార్మికులు నీటి సరఫరా సక్రమంగా చేయడం లేదు. ఈ దఫా నిధులు పెంచి చలివేంద్రాలకు టెండర్ ఆహ్వానించారు. గతంలో ఒక్కో చలివేంద్రానికి రూ.8 వేల నుంచి రూ.10 వేల చొప్పన వెచ్చిస్తుండేది. ఈ దఫా మాత్రం ఒక్కో తాత్కాలిక చలివేంద్రం ఏర్పాటులో భాగంగా తడకలు, రంజన్లు, గ్లాసులు, మగ్గు, బ్యానర్ల కోసం రూ.15 వేలు కాగా.. మూడు నెలల కాలనికి ఒకరి వేతనం రూ.30 వేలు, ఖర్చు రూ. ఐదు వేలు ఇలా మొత్తం రూ.50 వేల చొప్పున ఖర్చు కానుందని నిర్ణయించి టెండర్ ఖరారు చేశారు. ఇక బల్దియా ట్యాంకర్ల ద్వారా చలివేంద్రాలకు నీటిని సరఫరా చేయాలి. నగరంలోని సగానికి పైగా చలివేంద్రాలకు నీటి సరఫరా కావడం లేదు. కారణమేంటంటే ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయడం లేదని, మేం ఏం చేయాలని అక్కడే నీటి సరఫరా చేసే సిబ్బంది సమాధానం చెబుతున్నారు. బల్దియా ఏఈలు మాత్రం రోజుకు రెండు ట్రిప్పులుగా నీటి సరఫరా చేస్తున్నామని పేర్కొంటున్నారు. కొన్ని కేంద్రాల్లో సరిపడా నీరు ఉండడం లేదు. ఇంకొన్ని కేంద్రాల్లో వేడి నీరు లభిస్తుండగా, మరికొన్ని కేంద్రాల్లో ఖాళీ రంజన్లు దర్శనమిస్తున్నాయి. సిబ్బంది కానరాక అడుగంటిన ఖాళీగా ఉన్న కుండలే కనిపిస్తున్నాయి. ఇంకొన్ని చోట్ల దాతలు ఏర్పాటు చేసిన కేంద్రాలను తమ ఖాతాలో వేసుకొని ఖర్చులు చూపిస్తూ మోసం చేస్తున్నారు. చలివేంద్రాల ఏర్పాటు పేరుతో కొంతమంది నిధుల స్వాహాకు యత్నిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వివిధ పనులు రీత్యా నగరానికి విచ్చేస్తున్న వాహనదారులు, బాటసారులు, ప్రజలు చలివేంద్రాల్లో చల్లని నీరు దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బల్దియా చలివేంద్రాలు అంటే ఇలాగే ఉంటాయని పలువురు పెదవి విరుస్తున్నారు.
లోపాలు సరిదిద్దుతాం..
నగరంలోని అన్ని చలివేంద్రాల్లో తాగునీటి సరఫరా అవుతోంది. ఏఈలు ప్రతిరోజు పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడైనా లోపాలు ఉంటే సరిదిద్ది చర్యలు తీసుకుంటాం. జూన్ నెలాఖరు వరకు ప్రతి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు చలివేంద్రాల్లో నీటి సరఫరా చేయాల్సిందే.
– శ్రీనివాస్, బల్దియా ఇన్‌చార్జ్ ఎస్‌ఈ
న్యూస్‌రీల్

శనివారం శ్రీ 17 శ్రీ మే శ్రీ 2025