
పాఠ్యపుస్తకాలు వచ్చేశాయ్
విద్యారణ్యపురి: ప్రభుత్వ పాఠశాలలు జూన్ 12వ తేదీనుంచి పున:ప్రారంభం కానున్నాయి. పాఠశాలలు తెరిచిన రోజే విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు అందించనున్నారు. జిల్లాలోని గోదాంకు బుధవారం వరకు 74.95శాతం పాఠ్యపుస్తకాలు వచ్చాయి.
జిల్లాకు పార్ట్–1పుస్తకాలు..
జిల్లాల్లోని 1నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు 2,60,240 అవసరం. ఇందులో బుధవారం వరకు 1.95 లక్షల పాఠ్యపుస్తకాలు (74.95శాతం) జిల్లా కేంద్రంలోని గోదాంకు చేరుకున్నాయి. ఇంకా 65వేల పాఠ్యపుస్తకాలు రావాల్సి ఉంది. అన్ని తరగతులకు కలిపి 205 టైటిల్స్ వరకు రావాల్సిండగా అందులో ఇంకా కొన్ని పుస్తకాలు రాలేదు.కొద్దిరోజుల్లోనే అవి కూడా రానున్నాయని సమాచారం.
1నుంచి 5వ తరగతి విద్యార్ధులకు నోట్‌బుక్స్
ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదివే 6నుంచి 10వతరగతి విద్యార్థులకు ఇప్పటికే ప్రతి ఏటా నోట్‌బుక్స్‌ను అందజేస్తున్నారు.అయితే ఈ విద్యాసంవత్సరం (2025–26)లో 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు కూడా నోట్‌బుక్స్‌ను ఇవ్వనున్నారు. ఈమేరకు రాష్ట్ర విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. ఒకటో, రెండో తరగతి విద్యార్థులకు మూడు నోట్‌బుక్స్, 3నుంచి 5వ తరగతి విద్యార్థులకు నాలుగు చొప్పున నోట్‌బుక్స్‌ను అందిచనున్నారు. అయితే జిల్లాల్లోని పాఠశాలల విద్యార్థులకు నోట్ బుక్స్ ఈనెల13న వచ్చాయి. ఈసారి హైదరాబాద్ నుంచి నేరుగా పాఠశాలల పాయింట్స్‌కే పంపిస్తున్నారు. జిల్లాలోని హసన్‌పర్తి మండలం చింతగట్టు హైస్కూల్, సూరారం జెడ్పీఎస్‌ఎస్, కాజీపేట మండలంలోని రాంపూర్ ఉన్నత పాఠశాలలకు నోట్‌బుక్స్ చేరుకున్నాయి, కాగా జిల్లాలోని అన్ని పాఠశాలల్లో కూడా నోట్‌బుక్స్ రానున్నాయి.
నేటినుంచి మండల కేంద్రాలకు..
జిల్లా కేంద్రంలోని గోదాంకు 74.95 శాతం పాఠ్యపుస్తకాలు చేరుకున్నందున ఈనెల 15నుంచి వివిధ మండలాల్లోని ఎంఈఓ కార్యాలయాలకు వాటిని పంపనున్నారు. ప్రతి మండలంలోని స్కూళ్ల సంఖ్య, అందులో చదువుతున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠ్యపుస్తకాలను ఎంఈఓల ద్వారా మండల కేంద్రాలకు చేరుస్తారు. అక్కడి నుంచి పాఠశాలల హెచ్‌ఎంలకు స్కూల్ పాయింట్‌కు తీసుకెళ్లాల్సింటుంది. పాఠశాలలు తెరిచిన రోజే విద్యార్థులకు పుస్తకాలు అందజేయనున్నారు.
జిల్లాకు చేరిన 74శాతం పుస్తకాలు
ఈసారి 1నుంచి 5వ తరగతి
విద్యార్థులకు నోట్‌బుక్స్